న్యూఢిల్లీ: ఐపిఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ఆటగాడు ఐపిఎల్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఐపిఎల్ 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు లియామ్ లివింగ్ స్టోన్ తప్పుకున్నాడు. స్వదేశం ఇంగ్లండుకు వెళ్లిపోయాడు.

ఆ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. లియామ్ లివింగ్ స్టోన్ గత రాత్రి స్వదేశానికి వెళ్లిపోయాడని, ఏడాది కాలంగా బయోబబబుల్ లో ఉండలేక ఆ నిర్ణయం తీసుకున్నాడని, అతని పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని, అందుకే అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, అతనికి ఏ విధమైన మద్దతు అవసరమైనా తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని ప్రకటించింది.

ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో రాజస్థాన్ ఫ్రాంచేజీ లివింగ్ స్టోన్ ను కనీస ధర రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడింది. తుది జట్టులో అతనికి స్థానం దక్కలేదు. 

ఇక మరో ఆటగాడు జోఫ్రా అర్చర్ ఇప్పటికే జట్టు నుంచి వైదొలిగాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందే అతడి చేతికి సర్జరీ జరిగింది. దీంతో ఇప్పటి వరకు అతను టోర్నీకు దూరంగానే ఉన్నాడు.