కృనాల్ పాండ్యా కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కోహ్లీ కంటి దగ్గర బాల్ తాకింది. తొలుత చేతిని తాకిన బాల్, ఆపై నుదుటిపై కుడికన్ను సమీపంలో తాకింది.
ఐపీఎల్ సందడి మొదలైంది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో.. ముంబయి ఇండియన్స్ మీద... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు తన ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. 19వ ఓవర్ తొలి బాల్ ను వేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
కృనాల్ పాండ్యా కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కోహ్లీ కంటి దగ్గర బాల్ తాకింది. తొలుత చేతిని తాకిన బాల్, ఆపై నుదుటిపై కుడికన్ను సమీపంలో తాకింది. కంటి దగ్గర కావడంతో కోహ్లీ నొప్పితో విలవిలలాడిపోయాడు. అయినప్పటికీ.. తన జట్టు గెలుపు కోసం మైదానాన్ని వీడకుండా ఫీల్డింగ్ చేశాడు. కోహ్లీ ముఖంపై తగిలిన దెబ్బ కారణంగా, అతని కన్ను ఎర్రగా మారిపోయింది. కంటి నుంచి నీరు కారుతూ కూడా కనిపించింది. దీంతో బెంగళూరు అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఎంఐ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత నవ్వుకుంటూనూ పెవీలియన్ కు వెళ్లిన కోహ్లీ, ఆపై బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు విధించిన 160 పరుగుల విజయలక్ష్యాన్ని చివరి బంతికి ఆర్సీబీ ఛేదించి, ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకుని, రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. కోహ్లీ కన్ను ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారుతున్న ఫోటోలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
