ఐపీఎల్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒక జట్టును మించి మరో జట్టు పోటీ పడుతున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ లో బోణి కొట్టింది. నిన్నటి మ్యాచ్ చేజారినప్పటికీ... పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డును చేధించాడు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20ల్లో 5వేల పరుగులు వేగంగా పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు.

అంతేగాక టీమిండియా నుంచి వేగంగా 5వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగాను రాహుల్‌ రికార్డులకెక్కాడు. అంతకముందు టీమిండియా నుంచి విరాట్‌ కోహ్లి(167 ఇన్నింగ్స్‌ల్లో), సురేశ్‌ రైనా( 173 ఇన్నింగ్స్‌ల్లో) 5వేల పరుగులు మార్క్‌ను అందుకున్నారు.

ఇప్పుడు వారి రికార్డును తుడిచిపెట్టిన రాహుల్‌ 143 ఇన్నింగ్స్‌లో 5వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా చూసుకుంటే 5వేల పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో క్రిస్‌ గేల్‌( 132 ఇన్నింగ్స్‌లు) ఉండగా.. తాజాగా రాహుల్‌ రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఆసీస్‌ నుంచి షాన్‌ మార్ష్‌ టీ20ల్లో 5వేల పరుగులు పూర్తి చేసుకోవడానికి 144 ఇన్నింగ్స్‌లు తీసుకొని మూడవ స్థానంలో నిలిచాడు