జట్టు స్కోరు 7 పరుగుల వద్ద వెంకటేశ్ అయ్యర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను జారవిడిచిన ఎమ్మెస్ ధోనీ... కేబుల్ వైర్‌కి తగలడంతో క్యాచ్ పట్టినా నాటౌట్‌గా నిలిచిన శుబ్‌మన్ గిల్... 

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌లో 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి లక్ కలిసి వస్తోంది. ఫైనల్ మ్యాచ్‌లో ఒకటి కాదు, ఏకంగా రెండు సంఘటనలు కేకేఆర్‌కి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. హజల్‌వుడ్ వేసిన రెండో ఓవర్ రెండో బాల్‌కి షాట్ ఆడబోయిన వెంకటేశ్ అయ్యర్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ బంతి, వికెట్ కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్లింది...

క్యాచ్ పట్టినట్టే పట్టిన ఎమ్మెస్ ధోనీ, ఆఖరి సెకన్లలో దాన్ని జారవిడిచాడు. దీంతో డకౌట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న వెంకటేశ్ అయ్యర్, ఆ తర్వాతి బంతి నుంచి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసి... మ్యాచ్ టర్నర్‌గా నిలిచాడు. 

అలాగే వికెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న సీఎస్‌కేకి రవీంద్ర జడేజా బ్రేక్ ఇచ్చినట్టే కనిపించాడు. జడేజా వేసిన 10వ ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన శుబ్‌మన్ గిల్, అంబటి రాయుడు పట్టిన అద్భుత క్యాచ్‌కి అవుట్ అయ్యాడు...

అయితే టీవీ రిప్లైలో గిల్ కొట్టిన షాట్, కెమెరా కేబుల్‌కి తగిలి దిశ మార్చుకున్నట్టుగా కనిపించింది. దీంతో ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించిన అంపైర్లు, గిల్‌ను నాటౌట్‌గా తేల్చారు... అదే ఓవర్‌లో రెండు ఫోర్లు బాది, అప్పటిదాకా నెమ్మదిగా ఆడుతూ వచ్చిన గిల్, గేర్ మార్చినట్టు కనిపించాడు...

32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయ్యర్ అవుటయ్యే సమయానికి 10.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది కేకేఆర్... ఆ తర్వాతి బంతికే నితీశ్ రాణా కూడా డకౌట్ కావడంతో ఒకే ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా...