భారత బ్యాట్స్‌మెన్‌కి స్వదేశంలో పులులు, విదేశంలో పిల్లలు అని పిలుస్తారు. ఇక్కడి ఉపఖండ పిచ్‌లపై చెలరేగిపోయే భారత బ్యాట్స్‌మెన్, విదేశాల్లో మాత్రం దారుణంగా ఫెయిల్ అవుతారు. శ్రీలంక, పాక్, బంగ్లాదేశ్‌ల పిచ్‌లపై మాత్రమే మనకి ఘనమైన రికార్డు ఉంది. మరి ఈ సీజన్‌లో భారత బ్యాట్స్‌మెన్ రాణించగలరా? 

 2009 సీజన్‌లో దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ జరిగింది. మనవాళ్లు అక్కడ బాగానే రాణించారు కానీ సహజంగా యుఏఈలో క్రికెట్‌ సీజన్‌ ఫిబ్రవరి-మార్చిలో జరుగుతుంది. ఇప్పుడు ఐపీఎల్‌ సెప్టెంబర్‌-నవంబర్‌లో జరుగుతుంది. ఈ సమయంలో ఇక్కడ పిచ్‌లు ఎలా స్పందిస్తాయో ఆసక్తికరం. 

ఒకే వేదికలో 40 రోజుల వ్యవధిలో 24 మ్యాచులు జరిగితే, పిచ్‌లు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. పరిస్థితుల పరంగా ఈ ఐపీఎల్‌లో స్వల్ప స్కోర్లు నమోదు కానున్నాయి. సంప్రదాయ ఐపీఎల్‌ వేదికల్లో స్కోరింగ్‌ రేటు అధికంగా ఉండగా.. యుఏఈలో అత్యల్పంగా కనిపిస్తోంది. మనదగ్గర కాన్పూర్‌లో 9.1, కోల్‌కత 8.9, మొహాలి 8.8, బెంగళూర్‌ 8.6, ముంబయి 8.6, ఢిల్లీ 8.5, పుణె 8.4, జైపూర్‌ 8.3, హైదరాబాద్‌ 8.0, విశాఖపట్నం 7.9, చెన్నై ఓవర్‌కి 7.4 పరుగులు నమోదవుతున్నాయి. 

అదే యుఏఈ వేదికలు షార్జాలో 8.1, దుబాయ్ లో 7.5, అబుదాబిలో 7.3 పరుగులే వస్తున్నాయి. యుఏఈలో జరిగిన పీఎస్‌ఎల్(పాకిస్థాన్ క్రికెట్ లీగ్)‌లో సగుటున నాలుగు మ్యాచులకు ఓ సారి 180 ప్లస్‌ పరుగులు నమోదయ్యాయి. అయితే పాక్ క్రికెటర్లతో పాటు మన బ్యాట్స్‌మెన్ కాస్త మెరుగైన టెక్నిక్ కలవారు. కానీ అక్కడి పరిస్థితులకు అలవాటు పడకపోతే ఈ ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌ హైదరాబాద్‌, చెన్నైలో జరుగుతున్నట్టే స్వల్ప స్కోర్లకు పరిమితం కానుందని తెలుస్తోంది.ఇలా జరిగితే భారత అభిమానులు నిరుత్సాహానికి గురి అవ్వాల్సి ఉంటుంది.