దుబాయ్: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు విజయ్ శంకర్ గాయపడిన నేపథ్యంలో ఐసీసీకి భారత క్రికెట్ దిగ్జం సచిన్ టెండూల్కర్ ఐసీసీకి ఓ విజ్ఞప్తి చేశాడు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ విజ్ఞప్తి చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ లోనైనా, స్పిన్ బౌలింగ్ లోనైనా హెల్మెట్ ధారణను తప్పనిసరి చేయాలని ఆయన ఐసీసీని కోరారు. 

క్విక్ సింగిల్ తీసే క్రమంలో హైదరాబాద్ ఆల్ రౌండర్ విజయ శంకర్ కు బంతి బలంగా తగిలింది. అయితే, హెల్మెట్ ధరించడం వల్ల అతనికి పెద్ద ప్రమాదం తప్పింది. దానికి సంబంధించిన వీడియోను టెండూల్కర్ షేర్ చేస్తూ ఐసీసీకి విజ్ఞప్తి చేశారు. 

ఆటలో వేగం పెరిగిందని, అయితే అది సురక్షితమేనా అని, ఇటీవలి సంఘటన చూస్తే అది ఎంత ప్రమాదమో తెలియజేస్తోందని, అందువల్ల హెల్మెట్ ధారణను స్పిన్ బౌలింగులోనైనా, ఫాస్ట్ బౌలింగులోనైనా బ్యాట్స్ మెన్ హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేయాలని ఆయన అన్నారు. దీన్ని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణించాలని అన్నారు.

 

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మీద అక్టోబర్ 24వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన మ్యాచులో ఆ సంఘటన చోటు చేసుకుంది. జసోన్ హోల్డర్ బంతిని కొట్టి క్విక్ సింగిల్ కోసం కాల్ ఇచ్చాడు. రన్నవుట్ చేసే అవకాశాన్ని వాడుకోవడానికి పంజాబ్ ఫీల్డర్ నికోలస్ పూరన్ స్ట్రయికర్స్ ఎండ్ వికెట్లకు బంతిని కొట్టాడు. అది స్టంప్స్ ను తాకకుండా విజయ్ శంకర్ హెల్మెట్ ను తాకింది. దాంతో విజయ్ శంకర్ మైదానంలో పడిపోయాడు. 

బలమైన గాయం తగిలినప్పటికీ విజయ్ శంకర్ బ్యాటింగ్ ను కొనసాగించడానికి ప్రయత్నించాడు. అయితే, ఆ తర్వాతి బంతికే అతను అవుటయ్యాడు.

ఎగ్జిబిషన్ గేమ్ లో భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి సునీల్ గవాస్తర్ విసిరిన బంతి నుంచి పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన విషయాన్ని విజయ్ శంకర్ గాయపడిన సంఘటన గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. 

భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓఝా సచిన్ టెండూల్కర్ అభిప్రాయాన్ని సమర్థించాడు. అంపైర్లు కూడా హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేయాలని ఆయన అన్నారు.