దుబాయ్: సన్ రైజర్స్ హైదరాబాదుపై జరిగిన ఐపిఎల్ మ్యాచులో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సీజన్ లోనే అత్యంత చెత్త ప్రదర్శన చూపించాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో అన్ని అడ్డంకులను అధిగమించి సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ ను మట్టి కరిపించి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చూపించిన తెగువ వల్ల అది సాధ్యమైంది. 

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ హైదరాబాదుపై మంగళవారం జరిగిన మ్యాచులో ఏ మాత్రం తన సత్తాను చాటలేకపోయింది. నెట్ రన్ రేట్ బాగున్నప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ 12 పాయింట్లను మాత్రమే అప్పటి వరకు సాధించింది. 

కోల్ కతా నైట్ రైడర్స్ 14 పాయింట్లతో హైదరాబాదు కన్నా పాయింట్ల పట్టికలో అప్పటి వరకు ముందంజలో ఉంది. సీజన్ లో తనకెవరూ సాటిలేరంటూ దూసుకెళ్తున్న ముంబై హైదరాబాద్ చేతిలో తోక ముడిచింది. హైదరాబాదుపై 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 

ముంబై ఇండియన్స్ తమ ముందు ఉంచిన 150 పరుగుల లక్ష్యాన్ని డేవిడ్ వార్నర్ 58 బంతుల్లో 85 పరుగుులు, వృద్ధిమాన్ సాహా 45 బంతుల్లో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వరుసగా మూడు విజయాలు సాధించి హైదరాబాదు ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. 

అయితే, ముంబై ఇండియన్స్ కొంత మంది కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం కూడా హైదరాబాదుకు కలిసి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్డిక్ పాండ్యాలకు రెస్ట్ ఇచ్చింది. 

వాళ్లు కొంత మంది ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చారని, వారిని 150కి కట్టడి చేయడం గొప్ప విషయమని, తమ బౌలర్లకు క్రెడిట్ దక్కుతుందని, నదీమ్ అద్భుతంగా రాణించాడని డేవిడ్ వార్నర్ అన్నాడు. 

ముంబై బ్యాట్స్ మెన్ ను నదీం, రషీద్ ఖాన్ మిడిల్ ఓవర్లలో అద్బుతంగా కట్టడి చేశారు. నదీం రెండు వికెట్లు తీసుకోగా, రషీద్ ఒక్క వికెట్ పడగొట్టాడు. 

తాము ఏ సందర్బంలో కూడా చేతులెత్తేయడానికి సిద్ఘంగా లేమని, ప్రతి ఆటలోనూ తాము అదే తెగువ చూపించామని డేవిడ్ వార్నర్ అన్నాడు. భువనేశ్వర్ కుమార్, మిచెల్ మార్ష్ గాయపడ్డారని, అయితే వాళ్ల స్ఫూర్తి తమతో ఉందని అన్నాడు. 

ఎలిమినేటర్ మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ నెల 6వ తేదీన విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కోనుంది.

బహుశా ఈ సీజన్ అత్యంత చెత్త ప్రదర్శన ఇది అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మంచు తమకు ప్రతికూలంగా పనిచేసిందని, టాస్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అనుకున్నామని, అయితే తాము తగిన విధంగా ఆడలేకపోయామని అన్నాడు. 

గాయంతో గత నాలుగు మ్యాచులకు దూరమైన రోహిత్ శర్మ హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచులో మైదానంలోకి దిగాడు. అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. అయినప్పటికీ మైదానంలోకి దిగినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. 

వార్నర్, సాహా షో తమ నుంచి ఆటను లాగేసుకుందని అన్నాడు. పవర్ ప్లే వాళ్లు మంచి షాట్స్ ఆడారని, అది వారికి ఉపయోగపడిందని అన్నాడు. పవర్ ప్లేలో వికెట్లు తీసుకుని ఉంటే మంచు ఉన్నప్పటికీ వారి మీద ఒత్తిడి పెరిగి ఉండేదని అన్నాడు.