విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌ ఈ ఇద్దరి క్రికెట్‌ వైరం ప్రపంచ క్రికెట్‌ ప్రియులకు ఇష్టమైన సమరం. ఐపీఎల్‌లోనూ ఈ ఇద్దరు తలపడితే, ఆ ఉత్కంఠ, ఆసక్తిలో ఎటువంటి మార్పులు ఉండవు. 

ఐపీఎల్‌ 2020 సీజన్‌ను విరాట్‌ కోహ్లి నెమ్మదిగా ఆరంభించగా.. స్టీవ్‌ స్మిత్‌ వరుస విజయాలతో సీజన్‌ను ఘనంగా మొదలుపెట్టాడు. వరుస మ్యాచుల్లో వరుస అర్థ సెంచరీలు సాధించిన స్మిత్‌.. అనంతరం తేలిపోతున్నాడు. 

మరోవైప్‌ విరాట్ కోహ్లి ఆరంభ మ్యాచుల్లో విఫలమయ్యాడు. కానీ తర్వాత నాయకుడిగా, బ్యాట్స్‌మన్‌గా దుమ్మురేపుతున్నాడు.  ప్రథమార్థంలో బెంగళూర్‌ ఎనిమిది మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించగా.. రాజస్థాన్ ఎనిమిది మ్యాచుల్లో ఐదు పరాజయాలు చవిచూసింది. 

ప్లే ఆఫ్స్‌ రేసులో కోహ్లి జట్టు ముందంజలో ఉండగా.. ఆఖరు నాలుగులో నిలువకుండా ఉండేందుకు స్మిత్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. రాజస్థాన్‌, బెంగళూర్‌ తలపడిన చివరి మ్యాచ్‌లో బెంగళూర్‌ 8 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో చాహల్‌ మూడు వికెట్లతో రాయల్స్‌కు కళ్లెం వేయగా.. కోహ్లి, పడిక్కల్‌ అర్థ సెంచరీలు సాధించారు. 

నేడు దుబాయ్‌లో మధ్యాహ్నాం 3.30 గంటలకు బెంగళూర్‌, రాజస్థాన్‌ తలపడనున్నాయి.

డివిలియర్స్‌పై ఫోకస్‌

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో బెంగళూర్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ కంటే ముందు వాషింగ్టన్‌ సుందర్‌, శివం దూబెలను దింపాడు కోహ్లి. ఇద్దరు లెగ్‌ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు సుందర్‌, దూబెలను ముందు పంపాడని అనుకుంటే.. కుడి ఎడమ కలయిక కోసం ఏబీని వెనక్కి నెట్టినట్టు కోహ్లి చెప్పాడు. 

2019 నుంచి లెగ్‌ స్పిన్‌పై డివిలియర్స్‌కు మెరుగైన రికార్డు లేదు. డివిలియర్స్‌ సగటు 52.5 కాగు, స్ట్రయిక్‌రేటు 135.77. నేటి మ్యాచ్‌లోనూ రాహుల్‌ తెవాటియ, శ్రేయాస్‌ గోపాల్‌ లేదా మయాంక్‌ మార్కండే రూపంలో ఇద్దరు లెగ్‌ స్పిన్నర్లు ఉన్నారు. ఈ ఇద్దరిని డివిలియర్స్‌ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం.

బ్యాటింగ్‌ లైనప్‌ సమస్యలు

రాజస్థాన్‌ రాయల్స్‌ సైతం బ్యాటింగ్‌ లైనప్‌లో సమస్యలు చవిచూస్తోంది.  జోశ్‌ బట్లర్‌ తోడుగా ఓపెనింగ్‌కు ఎవరిని పంపాలనే విషయంలో స్మిత్ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. వరుసగా విఫలమవుతున్న రాబిన్‌ ఉతప్పనే ప్రయోగిస్తారా? లేక యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై నమ్మకం ఉంచుతారా? చూడాలి. 

బంతితో ఆర్చర్‌కు తోడు బ్యాట్‌తో సంజు శాంసన్‌ మెరిస్తే.. రాయల్స్‌ మళ్లీ గెలుపు పట్టేందుకు అవకాశాలు మెండు అవుతాయి.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌: దేవ్‌దత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌ (వికెట్‌ కీపర్‌), శివం దూబె, క్రిస్‌ మోరీస్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఇసురు ఉదాన, నవదీప్‌ సైని, మహ్మద్‌ సిరాజ్‌క్ష్/షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వెంద్ర చాహల్‌.

రాజస్థాన్‌ రాయల్స్‌: జోస్ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), బెన్‌ స్టోక్స్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, రాబిన్‌ ఉతప్ప/మనన్‌ వోహ్రా, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాటియ, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయాస్‌ గోపాల్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, కార్తీక్‌ త్యాగి.