Asianet News TeluguAsianet News Telugu

IPL 2020: ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లు ఇవే!

8 ప్రాంఛైజీలలో చెన్నై సూపర్‌కింగ్స్‌ మాత్రమే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి పూర్తిగా నిష్కమించింది. మిగిలిన ఏడు ప్రాంఛైజీలు టాప్‌-4లో చోటు సాధించగలే స్థితిలోనే ఉన్నాయి.

IPL 2020: Play Offs Chances For Each team Explained SRH
Author
Hyderabad, First Published Oct 26, 2020, 2:17 PM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తుది అంకానికి చేరుకుంటోంది.  డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ దశ మ్యాచులు మరో వారంలో ముగియనున్నాయి. అయినా, ఐపీఎల్‌ 2020 టాప్‌-4, ఫ్లే ఆఫ్స్‌ చేరుకునే జట్లపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 

8 ప్రాంఛైజీలలో చెన్నై సూపర్‌కింగ్స్‌ మాత్రమే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి పూర్తిగా నిష్కమించింది. మిగిలిన ఏడు ప్రాంఛైజీలు టాప్‌-4లో చోటు సాధించగలే స్థితిలోనే ఉన్నాయి. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌లు ప్లే ఆఫ్స్‌కు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. 

కోల్‌కత నైట్‌రైడర్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ప్ల ఆఫ్స్‌ అవకాశాలు పూర్తిగా ఆ జట్ల ప్రదర్శనపైనే ఆధారపడింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఇతర జట్ల ప్రదర్శన సహా ఇతర సమీకరణాలపై ఆశలతో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచాయి. నవంబర్‌ 5 నుంచి ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో.. టాప్‌-4లో నిలువగల జట్లేవే చూద్దాం.

ఆ మూడింటికి ఒకే ఒక్క విజయం చాలు!

11 మ్యాచులు, 7 విజయాలు వెరసి 14 పాయింట్లు. ప్లే ఆఫ్స్‌ మ్యాజిక్‌ మార్క్‌కు కేవలం రెండే పాయింట్ల దూరంలో నిలిచాయి ఆ మూడు జట్లు. ముంబయి ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌లు ప్లే ఆఫ్స్‌లో చోటు దాదాపు ఖాయం చేసుకున్నాయి. కానీ ఆఖరు దశ మ్యాచుల్లో చావోరేవో తేల్చుకుంటున్న జట్లపై రెండు పాయింట్లు గెల్చుకోవటం అంత సులువు కాదు.  

పంజాబ్‌తో డబుల్‌ సూపర్‌ ఓవర్‌ సహా, రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓటమి ముంబయి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖాయం కాకుండా చేశాయి.  ముంబయి ఇండియన్స్‌ ఆడాల్సిన చివరి మూడు మ్యాచుల్లో గట్టి ప్రత్యర్థులనే ఎదుర్కొవాల్సి ఉంది. టాప్‌-2లో చోటు కోసం పోటీపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో ముంబయి ఆడనుంది. 

ఇక లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రోహిత్‌సేన తలపడాల్సి ఉంది. ఈ మూడింటిలో ఏ ఒక్క మ్యాచ్‌లో నెగ్గినా.. ముంబయి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖాయం. ఢిల్లీ క్యాపిటల్స్‌ తన చివరి మూడు మ్యాచుల్లో ముంబయి, బెంగళూర్‌ సహా హైదరాబాద్‌తో ఆడనుంది.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ సైతం తన చివరి రెండు మ్యాచుల్లో ముంబయి, ఢిల్లీని ఆఖర్లో సన్‌రైజర్స్‌తో ఆడనుంది.  ప్రస్తుతం టాప్‌`-3లో నిలిచిన ముంబయి, బెంగళూర్‌, ఢిల్లీలు ఆఖరు వారంలో ముఖాముఖి ఆడనుంటం అగ్ర జట్ల నడుమ ఆధిపత్య పోరుకు ముందే తెరతీసినట్టు అవనుంది.  
ఎవరి బెర్త్‌ వారి చేతుల్లోనే..!

11 మ్యాచుల్లో ఆరు విజయాలతో కోల్‌కత, 11 మ్యాచుల్లో ఐదు విజయాలతో కోల్‌కత, పంజాబ్‌లు పాయింట్ల పట్టికలో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం పంజాబ్‌కు చివరి మూడు మ్యాచుల్లోనూ విజయాలు అవసరం. కోల్‌కత మూడు మ్యాచుల్లో రెండు గెలిచినా.. టాప్‌-4లో చోటు నిలుపుకోగలదు.  కోల్‌కత చివరి మూడు మ్యాచుల్లో పంజాబ్‌ను, చెన్నై సూపర్‌కింగ్స్‌ను, రాజస్థాన్‌ రాయల్స్‌ను ఎదుర్కొవాల్సి ఉంటుంది. పంజాబ్‌ తన మూడు మ్యాచుల్లో కోల్‌కత, రాజస్థాన్‌, చెన్నైలతో తలపడాల్సి ఉంది.  ఈ మ్యాచుల్లో కోల్‌కత, పంజాబ్‌ మ్యాచ్‌ ఈ రెండు జట్ల అవకాశాలతో పాటు రేసులో నిలిచిన మిగిలిన రెండు జట్ల అవకాశాలను సైతం ప్రభావితం చేయగలదు.

కష్టమే.. అయినా అవకాశం ఉంది!

పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న జట్లు రాజస్థాన్‌ రాయ్సల్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. రాజస్థాన్‌ 12 మ్యాచుల్లో ఐదు విజయాలే సాధించగా.. సన్‌రైజర్స్‌ 11 మ్యాచుల్లో నాలుగు విజయాలే సాధించింది. చివరి రెండు మ్యాచుల్లో రాయల్స్‌, చివరి మూడు మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ విజయాలు సాధిస్తే 14 పాయింట్ల పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా నిలుపుకుంటాయి.

కానీ అక్కడితో బెర్త్‌ ఖాయం కాదు. ఇతర జట్ల ప్రదర్శనలు, నెట్‌రన్‌రేట్‌ ఆధారంగా టాప్‌-4లో నిలిచే అవకాశం ఉంటుంది. పంజాబ్‌, కోల్‌కత మ్యాచ్‌లో పంజాబ్‌ నెగ్గితే రాయల్స్‌ అవకాశాలు మెరుగు అవుతాయి. నెట్‌ రన్‌రేట్‌లో కోల్‌కతను వెనక్కి నెట్టి రాయల్స్‌ ముందుకు వెళ్లేందుకు అవకాశం కలదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన చివరి మూడు మ్యాచుల్లో అగ్ర జట్లను ఢీకొట్టనుంది.

టాప్‌-3 పొజిషన్‌లో ఉన్న ముంబయి, బెంగళూర్‌, ఢిల్లీలతో హైదరాబాద్‌ ఆడాల్సి ఉంది. ఇక రాజస్థాన్‌ తన చివరి రెండు మ్యాచుల్లో పంజాబ్‌, కోల్‌కతలను ఓడిస్తే ఆ జట్ల అవకాశాలను దెబ్బతీయటంతో పాటు తన అవకాశాలను మెరుగు పర్చుకోనుంది.

ఐపీఎల్‌ 2020 లీగ్‌ దశ తుది అంకానికి చేరుకున్నా.. టాప్‌-4లో నిలిచేందుకు ఏడు జట్లకు వాస్తవిక అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఖరు దశలో అన్ని జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి.

ముంబయి, ఢిల్లీ, బెంగళూర్‌లు ఓ విజయం దూరంలోనే నిలిచినా.. ఐపీఎల్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సంచలన ఫలితాలతో అలరిస్తున్న బయో బబుల్‌ ఐపీఎల్‌ ఆఖరు వారంలోనూ అదే రీతిలో ఆశ్చర్యపరిస్తే టాప్‌-4లో నిలుస్తాయనుకుంటున్న జట్లు లీగ్‌ దశలోనే నిష్కమించే ప్రమాదం లేకపోలేదు. టాప్‌లో నిలిచిన జట్లు ధనాధన్‌తో దుమ్మురేపితే.. ముందుగా అనుకుంటున్నట్టు ఆ నాలుగు జట్లే ప్లే ఆఫ్స్‌ లో పోటీపడవచ్చు. ఆ నాలుగు జట్లు ఏవే తేలాలంటే మరో వారం మ్యాచులు ముగియాల్సిందే!.  

Follow Us:
Download App:
  • android
  • ios