Asianet News TeluguAsianet News Telugu

IPL 2020: ప్లే ఆఫ్స్‌ 'బెర్త్‌ మే సవాల్‌'

ఐపీఎల్‌ లీగ్‌ దశలో ఇంకో నాలుగు మ్యాచులే మిగిలాయి. నేడు రెండు మ్యాచులు ముగియనుండగా..  నవంబర్‌ 3న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌తో లీగ్‌ దశకు తెర పడనుంది. అయితే, ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు తేలేందుకు ఆఖరు మ్యాచ్‌ వరకూ ఎదురు చూడాల్సిందే.

IPL 2020 play offs chances for each team explained
Author
Dubai - United Arab Emirates, First Published Nov 1, 2020, 1:52 PM IST

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ రేసు మరింత రసవత్తరంగా మారుతోంది. వారం రోజుల క్రితం పాయింట్ల పట్టికలో టాప్‌-4 జట్లకు, మిగతా నాలుగు జట్లకు స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది. ముంబయి ఇండియన్స్‌ సహా ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌లు అలవోకగా ప్లే ఆఫ్స్‌కు చేరేలా కనిపించాయి.

9 మ్యాచుల్లో ఏడు విజయాలతో ఆ జట్లు టాప్‌-2పై కన్నేశాయి. కానీ ఇంతలోనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌లలో ఏదో ఒక్క జట్టే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనుంది. మిగతా రెండు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ల కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌ సహా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీపడుతున్నాయి.

అసలు సిసలు సమరానికి వేళాయే..!

ఐపీఎల్‌ లీగ్‌ దశలో ఇంకో నాలుగు మ్యాచులే మిగిలాయి. నేడు రెండు మ్యాచులు ముగియనుండగా..  నవంబర్‌ 3న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌తో లీగ్‌ దశకు తెర పడనుంది.

అయితే, ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు తేలేందుకు ఆఖరు మ్యాచ్‌ వరకూ ఎదురు చూడాల్సిందే. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచిన అన్ని జట్లు ఈ నాలుగు మ్యాచుల్లో బరిలోకి దిగుతుండటం రేసును మరింత ఉత్కంఠభరితం చేస్తున్నాయి.

ఢిల్లీ, బెంగళూర్‌ షూటౌట్‌!

IPL 2020 play offs chances for each team explained

13 మ్యాచుల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌లు పాయింట్ల పట్టికలో వరుసగా 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. నాలుగు మ్యాచుల్లో ఓ విజయం సాధిస్తే సరిపోయే స్థితి నుంచి ఈ జట్లు చావోరేవో తేల్చుకునే వరకూ తెచ్చుకున్నాయి.

లీగ్‌ దశ ఆఖరులో ఈ రెండు జట్లు లయ కోల్పోయాయి. అందుకు కారణాలు ఎలాగున్నా.. ఇప్పుడు ఈ రెండు జట్లలో ఏదో ఒక్క జట్టు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. బెంగళూర్‌, ఢిల్లీలు సోమవారం అబుదాబిలో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంది.

ఈ రెండు జట్ల ముఖాముఖి షూటౌట్‌లో గెలుపొందిన జట్టు 16 పాయింట్లతో టాప్‌-2 బెర్త్‌తో క్వాలిఫయర్లో ఆడనుంది. ఓడిన జట్టు నెట్‌ రన్‌రేట్‌ మరింత దిగజారనుండటంతో.. ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం అదృష్టాన్ని నమ్ముకోవాల్సిందే.  

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ నెట్‌రన్‌రేట్‌ -0.145 కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ నెట్‌ రన్‌రేట్‌ -0.159గా ఉంది. దీంతో ఓడిన జట్టు లీగ్‌ దశ నుంచే నిష్కమించే ప్రమాదం ఉంది. అందుకే ఈ మ్యాచ్‌లో రెండు జట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి.

నిలవాలంటే.. గెలవాలి :

13 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించిన జట్లు రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ రేసులో నిలిచేందుకు మ్యాజిక్‌ మార్క్‌కు రాజస్థాన్‌, కోల్‌కతలు రెండు పాయింట్ల దూరంలో ఉన్నాయి. ఈ రెండు జట్లు నేడు దుబాయ్‌లో ముఖాముఖి ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలువనుంది. ఓడిన జట్టు నేరుగా లీగ్‌ దశ నుంచి నిష్కమించాల్సిందే.

రాజస్థాన్‌ రాయల్స్‌ నెట్‌ రన్‌రేట్‌ -0.377 కాగా.. కోల్‌కత నైట్‌రైడర్స్‌ నెట్‌రన్‌రేట్‌ -0.467. విజయంతో పాటు బుణాత్మక నెట్‌ రన్‌రేట్‌ నుంచి బయటపడేలా భారీ విజయంపై ఈ రెండు జట్లు కన్నేశాయి.

కేవలం ఈ మ్యాచ్‌లో విజయంతో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖాయం కాబోదు. ప్లే ఆఫ్స్‌ రేసులో ఆశలు మాత్రమే సజీవంగా నిలుస్తాయి.  ముంబయి, హైదరాబాద్‌ మ్యాచ్‌ ఫలితంతో పాటు బెంగళూర్‌, ఢిల్లీ మ్యాచ్‌లో ఓటమి అంతరం కోల్‌కత, రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ప్రభావితం చేయనుంది.

నెగ్గితే నేరుగా ప్లే ఆఫ్స్‌కు..!

ప్లే ఆఫ్స్‌ రేసులో ఓ కింగ్స్‌ ఎలెవన్‌ ఫంజాబ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ సహా కోల్‌కత నైట్‌రైడర్స్‌ దూకుడుగా సాగిపోతున్న తరుణంలో.. కూల్‌గా ప్లే ఆఫ్స్‌ రేసులో తన అవకాశాలను పదిలం చేసుకుంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.  వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌లపై భారీ విజయాలు సాధించిన హైదరాబాద్‌ 13 మ్యాచుల్లో 12 పాయింట్లు సాధించింది.

IPL 2020 play offs chances for each team explained

0.555 నెట్‌ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది. నవంబర్‌ 3, షార్జాలో అగ్ర జట్టు ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆఖరు మ్యాచ్‌లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయం సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖాయం కానుంది.

కోల్‌కత, రాజస్థాన్‌ మ్యాచ్‌లో ఓ జట్టు రేసు నుంచి నిష్కమించనుండగా.. బెంగళూర్‌, ఢిల్లీ మ్యాచ్‌లో ఓడిన జట్టు నెట్‌ రన్‌రేట్‌ మరింత దిగజారనుండటంతో.. మెరుగైన నెట్‌రన్‌రేట్‌ కలిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానంతో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను సొంతం చేసుకోనుంది.

ఐపీఎల్‌ 2020 లీగ్‌ దశలో ఇంకో నాలుగు మ్యాచులే మిగిలాయి. అయినా, ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం పోటీపడుతున్న ఆరు జట్లు ఈ నాలుగు మ్యాచుల్లో పోటీపడుతున్నాయి. దీంతో బయో బబుల్‌ ఐపీఎల్‌లో అప్పుడే నాకౌట్‌ ఉత్కంఠ వచ్చేసింది.

ప్లే ఆఫ్స్‌ పోటీతత్వం అభిమానులు ముందుగానే వినోదించనున్నారు. ప్లే ఆఫ్స్‌లో మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీపడుతున్న అరుదైన సమీకరణంలో.. చివరి నాలుగు మ్యాచులు ముగిస్తే కానీ టాప్‌-4 లెక్క తేలదు. 

Follow Us:
Download App:
  • android
  • ios