కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలో కరోనా కేసులు అధికంగా పెరిగిపోయాయి. రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. అన్ని క్రీడా ఈవెంట్లు సైతం ప్రపంచవ్యాప్తంగా వాయిదాపడ్డాయి. విశ్వక్రీడలు ఒలింపిక్స్ సైతం వాయిదా పడ్డాయి. మన దేశంలో అత్యధిక మంది అత్యంత ఆతృతతో ఎదురు చూసే ఐపీఎల్ కూడా వాయిదా పడింది. 

భారత్‌లో సైతం కరోనా వైరస్‌ కేసులు అన్‌లాక్‌ 1.0లో గణనీయంగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు 6 లక్షలకు చేరిపోయాయి. ఈ పరిస్థితులు, కోవిడ్‌-19 కేసులతో భారత్‌లో ఐపీఎల్‌2020 నిర్వహించటం అసాధ్యమనే చెప్పవచ్చు. 

ప్రేక్షకులు లేకుండానే ఈసారి ఐపీఎల్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయాన్నీ బీసీసీఐ ప్రకటించింది. ఆరంభంలో ముంబయి ఏకైక వేదికగా ఐపీఎల్‌13 నిర్వహణకు బీసీసీఐ ఆలోచన చేసినా.. ఇప్పుడు ముంబయి కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌. 

ఇంతటి గడ్డు పరిస్థితుల్లో, ఐపీఎల్‌ నిర్వహణ కష్టం. దీంతో ఐపీఎల్‌2020 భారత్‌లో జరిగే అవకాశం లేదని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. 'ఐపీఎల్‌ వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ, ఈ ఏడాది ఐపీఎల్‌ కచ్చితంగా విదేశాల్లో ఉంటుంది. 

8 జట్లు ఒకేచోటకు చేరి లీగ్‌లో ప్రాతినిథ్యం వహించే పరిస్థితులు ఇప్పుడు మన దగ్గర లేవు. ఎక్కడ జరిగినా ప్రేక్షకులకు అనుమతి ఉండదు, ఖాళీ స్టేడియంలోనే నిర్వహిస్తాం. ఆటగాళ్లకు సురక్షిత వాతావరణంలో లీగ్‌ నిర్వహణకే బోర్డు మొగ్గుచూపుతుంది' అని ఆ అధికారి అన్నారు. 

ఐపీఎల్‌ 2020 నిర్వహణకు యుఏఈ, శ్రీలంకలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండింటిలో అనువైన వేదికను ఎంచుకునేందుకు బీసీసీఐ యోచిస్తోంది. ఆధునాతన స్టేడియాలు, ప్రపంచస్థాయి సదుపాయాలు కలిగిన యు.ఏ.ఈ వైపే మొగ్గుచూపేందుకు ఆస్కారం కనిపిస్తోంది. 2014 ఐపీఎల్‌ ప్రథమార్థం యు.ఈ.ఏలోనే నిర్వహించిన సంగతి తెలిసిందే.