ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎలాంటి ఆరంభ వేడుకలు లేకుండా సింపుల్‌గా ప్రారంభమైంది. గత ఏడాది పుల్వామా దాడి కారణంగా ఆరంభ వేడుకలను రద్దు చేసిన యాజమాన్యం, ఆ ధనాన్ని భారత జవాన్ల సంరక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఆరంభ వేడుకలను రద్దు చేశారు. అలాగే ఆటగాళ్ల సంరక్షణ దృష్టిలో ఉంచుకుని స్టేడియాల్లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు.

కేవలం యూఏఈ మీడియాకి మాత్రమే అనుమతి ఉంటుంది. మ్యాచ్‌లకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు కూడా ఉండబోవు. మ్యాచ్ ముగిశాక మాత్రం వర్చువల్ మీడియా సమావేశాలు ఉంటాయి. ఏమైనా అప్‌డేట్స్ ఉంటే ప్రెస్ నోట్స్ విడుదల చేస్తామని తెలియచేసింది బీసీసీఐ.

ద్వైపాక్షిక సిరీస్ ముగించుకుని సెప్టెంబర్ 18న దుబాయ్ చేరుకున్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లలో కొందరు తప్పనిసరి కరోనా టెస్టును క్లియర్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు బౌలర్ జోఫ్రా ఆర్చర్, బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్‌లకు కోవిద్ టెస్టులో క్లియరెన్స్ వచ్చింది. వీరికి నిర్వహించిన కరోనా పరీక్షలో ముగ్గురికీ నెగిటివ్ వచ్చింది. దీంతో 36 గంటల క్వారంటైన్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఈ ముగ్గురూ ఆడబోతున్నారు.

అయితే స్టీవ్ స్మిత్ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతని తలకి జరిగిన దెబ్బ ఇంకా మానలేదు. ఈ కారణంగానే ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతను ఆడలేదు. డాక్టర్లు ఇచ్చే క్లియరెన్స్‌పైనే స్మిత్, చెన్నైతో జరిగే మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది తేలనుంది.