Asianet News TeluguAsianet News Telugu

IPL 2020: క్యా(మ్యా)చులు చేజారిపోతున్నాయ్‌!

క్యాచులు మ్యాచులను గెలిపిస్తాయి. క్యాచులు మ్యాచులను మలుపు తిప్పుతాయి. క్యాచులు మ్యాచ్‌ ఫలితాలను శాసిస్తాయి. ఉత్కంఠ మ్యాచ్‌లోనే కాదు పస లేని మ్యాచుల్లోనూ ఓ క్యాచ్‌ నేలపాలైతే.. ఆ ప్రభావం గట్టిగానే ఉంటుంది

IPL 2020: Missed Catches Are Proving Costly For teams
Author
Dubai - United Arab Emirates, First Published Oct 7, 2020, 9:10 AM IST

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌. మార్కస్‌ స్టోయినిస్‌ 30 పరుగుల వద్ద ఉన్నాడు. అతడు ఇచ్చిన ఓ క్యాచ్‌ను యుజ్వెంద్ర చాహల్‌ నేలపాలు చేశాడు. డెత్‌ ఓవర్లలో ధనాధన్‌కు సిద్ధమవుతున్న స్టోయినిస్‌ క్యాచ్‌ను చాహల్‌ వదిలేయటంతో.. అతడు ఆఖరు ఓవర్లలో అపార నష్టం చేశాడు.  మెరుపు వేగంతో అర్థ సెంచరీతో చెలరేగాడు.

చాహల్‌ మైదానంలో పాదరసంలా కదిలే ఫీల్డర్‌. అతడు క్యాచులు నేలపాలు చేసిన సందర్భాలు లేవు. ఇది ఒక్క చాహల్‌కే పరిమితం కాలేదు. ప్రపంచ క్రికెట్‌ అత్యుత్తమ ఫీల్డర్లు అనదగిన క్రికెటర్లు ఎమిరేట్స్‌ పిచ్‌లపై క్యాచులు అందుకోవటంలో తడబడుతున్నారు. బౌండరీ లైన్‌ దగ్గర కళ్లుచెదిరే రీతిలో రీలే క్యాచులు వరుసగా అందుకుంటున్న ఐపీఎల్‌లోనే... చేతుల్లోకి వచ్చిన క్యాచులు నేలపాలు కావటం ఆశ్చర్యకరం.

క్యాచులు మ్యాచులను గెలిపిస్తాయి. క్యాచులు మ్యాచులను మలుపు తిప్పుతాయి. క్యాచులు మ్యాచ్‌ ఫలితాలను శాసిస్తాయి. ఉత్కంఠ మ్యాచ్‌లోనే కాదు పస లేని మ్యాచుల్లోనూ ఓ క్యాచ్‌ నేలపాలైతే.. ఆ ప్రభావం గట్టిగానే ఉంటుంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వంటి వరల్డ్‌ క్లాస్‌ ఈవెంట్‌లో క్యాచులు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ 2020లో క్యాచులు చేజారటం సర్వ సాధారణమైంది.

భారత జట్టులోనే కాదు ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడు విరాట్‌ కోహ్లి. కానీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి నమ్మశక్యం కాని రీతిలో ఏకంగా మూడు క్యాచులు నేలపాలు చేశాడు. మైదానంలో పాదరసంలా కదిలే ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌ భారత జట్టులోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడు.  కానీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అయ్యర్‌ మిడ్‌ వికెట్‌లో సులువైన క్యాచ్‌ నేలపాలు చేశాడు. విరాట్‌ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌ క్యాచులు నేలపాలు చేసిన మ్యాచుల్లో ఆ జట్లు పరాజయం పాలయ్యాయి.

కన్నడ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప సైతం మంచి ఫీల్డర్‌. బేసిక్‌గా వికెట్‌ కీపర్‌ అయిన ఉతప్ప.. క్యాచులు అందుకోవటంలో దిట్ట. కానీ రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఉతప్ప వరుసగా రెండు మ్యాచుల్లో క్యాచులు నేలపాలు చేశాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో, కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఉతప్ప క్యాచులు జారవిడిచాడు. ఈ రెండు మ్యాచుల్లోనూ గాల్లోకి పైకి లేని క్యాచులనే ఉతప్ప నేలపాలు చేశాడు.

ఐపీఎల్‌ 2020లో క్యాచులు నేలపాలు కావటంలోనూ స్టేడియాల ప్రకారం గణాంకాలు (అక్టోబర్‌ 1 నాటికి) విచిత్రంగా ఉన్నాయి. దుబాయ్‌లో జరిగిన ఆరు మ్యాచుల్లో ఏకంగా 24 క్యాచులు నేలపాలు కాగా.. అబుదాబి, షార్జా వేదికల్లో 11 క్యాచులు నేలపాలు అయ్యాయి. క్లిష్టమైన క్యాచులను ఈ జాబితా నుంచి తొలగించినా.. దుబాయ్‌లో 10 క్యాచులు జారవిడువగా.. అబుదాబి, షార్జాల్లో ఐదు క్యాచులనే ఒడిసిపట్టుకోలేదు.

దుబాయ్‌లో భారీ సంఖ్యలో క్యాచులు నేలపాలు కావటంపై వ్యాఖ్యాతలు ఫ్లడ్‌ లైట్లను కారణంగా చెబుతున్నారు. దుబాయ్‌ ఫ్లడ్‌లైట్ల కారణంగానే ఇక్కడ ఉత్తమ ఫీల్డర్లు సైతం క్యాచులు అందుకోవటంలో ఇబ్బంది పడుతున్నారని లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు.

చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌, క్రికెట్‌ దిగ్గజం ఎం.ఎస్‌ ధోని వాదన మరో విధంగా ఉంది. దుబాయ్‌ స్టేడియంలో ప్లడ్‌లైట్ల కారణంగా క్యాచులు జారిపోతున్నాయని నేను అనుకోవటం లేదు. నేను ఎప్పట్లాగే బంతిని అందుకుంటున్నాను. ఎటువంటి వ్యత్యాసం కనిపించటం లేదు. ఒకవేళ క్రికెటర్లు వ్యాఖ్యాతల మాటలు వింటే.. ఆటగాళ్లకు ఓ సాకు దొరికినట్టేనని మహి అన్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయాష్‌ అయ్యర్‌ వాదన మరో విధంగా ఉంది. దుబాయ్‌ పరిస్థితులు క్యాచింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేవు, అందుకు క్యాచుల విషయంలో ఫీల్డర్లకు బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ ఇచ్చేస్తానని అయ్యర్‌ అన్నాడు. లైటింగ్‌ కారణంగా బంతిని సరిగా అంచనా వేయలేకపోతున్నాం. కొన్నిసార్లు క్యాచింగ్‌లో మన పొజిషన్‌ ఎక్కడుండాలనే గందరగోళం నెలకొంటుందని అయ్యర్‌ తెలిపాడు.

ఐపీఎల్‌ 2020లో ఇప్పటివరకు 19 మ్యాచులే జరిగాయి. ఈ మ్యాచుల్లోనే విఫల క్యాచింగ్‌ గణాంకాలు కలవర పెడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఐపీఎల్‌ క్యాచులు జారవిడచటంలోనూ సరికొత్త రికార్డు నెలకొల్పే ప్రమాదం లేకపోలేదు!.

Follow Us:
Download App:
  • android
  • ios