Asianet News TeluguAsianet News Telugu

IPL2020 MI VS SRH : రోహిత్‌సేనను వార్నర్‌ సైన్యం ఆపగలదా?!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అంటే డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో, కేన్‌ విలియమ్స్‌లే కనిపిస్తారు. బ్యాటింగ్‌ భారం అంతా ఈ ముగ్గురు తీసుకుంటారు. ఈ ముగ్గురు విఫలమైతే హైదరాబాద్‌ కథ కంచికే. తొలిసారి దేశవాళీ బిగ్‌ ప్లేయర్లను కాకుండా యువ క్రికెటర్లపై నమ్మకం ఉంచిన హైదరాబాద్‌.. అందుకు తగిన ప్రతిఫలం పొందుతోంది.

IPL 2020: MI VS SRH Match preview, Stats, Head To Head, Fantasy Picks Pitch Report And  Probable Playing Eleven
Author
Hyderabad, First Published Oct 4, 2020, 2:12 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నాలుగు మ్యాచులు.  రెండు విజయాలు. రెండు ఓటములు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య పోలికలు ఇవి. ఇక ఏ కోణంలో చూసినా ఈ రెండు జట్లది భిన్నమైన శైలి, విభిన్నమైన బలం.

బిగ్‌ హిట్టర్లతో కూడిన ముంబయి ఇండియన్స్‌ మరింత ప్రమాదకరంగా మారుతుండగా... స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అండ లేకుండా సన్‌రైజర్స్‌ విజయాలు సాధించటం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది.  

సీజన్‌లో మూడు విజయం కోసం ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లు నేడు పోటీపడనున్నాయి.  చిన్న బౌండరీల షార్జాలో నేడు మధ్యాహ్నాం 3.30 గంటలకు మ్యాచ్‌ ఆరంభం కానుంది.

కుర్రాళ్లు తోడయ్యారు!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అంటే డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో, కేన్‌ విలియమ్స్‌లే కనిపిస్తారు. బ్యాటింగ్‌ భారం అంతా ఈ ముగ్గురు తీసుకుంటారు. ఈ ముగ్గురు విఫలమైతే హైదరాబాద్‌ కథ కంచికే.

తొలిసారి దేశవాళీ బిగ్‌ ప్లేయర్లను కాకుండా యువ క్రికెటర్లపై నమ్మకం ఉంచిన హైదరాబాద్‌.. అందుకు తగిన ప్రతిఫలం పొందుతోంది. డెవిడ్‌ వార్నర్‌, బెయిర్‌స్టో, కేన్‌ విలియమ్సన్‌, మనీశ్‌ పాండేలు 69 పరుగులకే డగౌట్‌కు చేరుకున్నారు.

ఈ పరిస్థితుల్లో చెన్నై ప్రత్యర్థులకు కోలుకునే అవకాశమే ఇవ్వదు. కానీ యువ ఆటగాడు ప్రియమ్‌ గార్గ్‌ సూపర్‌కింగ్స్‌కు పంచ్‌ ఇచ్చాడు. మరో యువ సహచరుడు అభిషేక్‌ శర్మతో కలిసి ధోనీసేనపై పరుగులు వేట సాగించాడు. సన్‌రైజర్స్‌కు మంచి స్కోరు అందించాడు.

'స్కొరు బోర్డు గురించి పట్టించుకోవద్దు. క్రీజులోకి వెళ్లి స్వేచ్ఛగా ఆడండి. అవుట్‌ అయితే అవుతాం, అంతే. అంతిమంగా ఇదో క్రికెట్ మ్యాచ్‌. ఒత్తిడి, కంగారూ అక్కర్లేదు' అని డెవిడ్‌ వార్నర్‌ యువ ఆటగాళ్లకు స్పష్టమైన సందేశం ఇచ్చాడు.

వార్నర్‌, బెయిర్‌స్టో, విలియమ్సన్‌లకు ఇప్పుడు కుర్రాళ్ల అండ లభించింది. స్టార్స్‌, యంగ్‌ గన్స్‌ కలిసి మెరిస్తే ముంబయిని ముప్పుతిప్పలు పెట్టడం పెద్ద విషయం కాబోదు!.

షార్జాపై ముంబయి మోజు!

చిన్న బౌండరీల షార్జాపై ముంబయి మోజు పడుతోంది. పెద్ద బౌండరీల అబుదాబిలోనే 200కు చేరువగా పరుగులు చేసిన ముంబయి..ఇక్కడ ఆకాశమే హద్దుగా సిక్సర్లు బాదుకొచ్చని భావిస్తోంది.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యలు ఫామ్‌లో ఉన్నారు. అలవోకగా సిక్సర్లు సంధించే ఈ త్రయం నేడు షార్జాలో ఏం చేస్తుందనేది ఆసక్తికరం. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ ఫామ్‌ కోల్పోయినట్టు కనిపిస్తున్నాడు.

షార్జాలో పవర్‌ ప్లేలో మెరిసినా, డికాక్‌ సులువుగా భారీ స్కొరు చేసేందుకు వీలుంది. బౌలర్లకు ప్రాధాన్యం లేని షార్జాలో బుమ్రా తన ప్రత్యేకత నిలుపుకుంటాడేమో చూడాలి.

వీటిపై ఓ లుక్కేయండి!

1. ముంబయి కీలక పేసర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ గాయంతో నాలుగు మ్యాచులకు దూరమయ్యాడు. అతడి గాయంపై ముంబయి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అతడు ఎప్పుడు అందుబాటులోకి వచ్చేది తెలియటం లేదు. అతడు ఫిట్‌నెస్‌ సాధించినా బౌల్ట్‌, పాటిన్సన్‌ జోడీతోనే ముంబయి కొనసాగే వీలుంది.

2. చివరి మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ తొడ నొప్పితో మైదానం వీడాడు. భువనేశ్వర్‌ కుమార్‌ కోలుకున్నదీ లేనిది తెలియదు. ఒకవేళ భువి అందుబాటులో లేకుంటే, సందీప్‌ శర్మ బౌలింగ్‌ విభాగంలో చేరనున్నాడు.

3. సందీప్‌ శర్మపై రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 గణాంకాలు ఏమీ బాగోలేవు. రోహిత్‌ 14.5 సగటు, స్ర్టయిక్‌రేట్‌ 88 కలిగి ఉండగా.. సూర్యకుమార్‌ సగటు 7.7, స్ర్టయిక్‌రేట్‌ 102గా ఉంది. సందీప్‌ నేడు ముంబయిపై ఆడితే.. భువి లేని లోటు పెద్దగా తెలియకపోవచ్చు.

4. హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌.. డెత్‌ ఓవర్లలో బౌలర్ల మొహంపై నెత్తుటి చుక్క లేకుండా చేయగల ప్రమాదకర విధ్వంసకారులు ఈ ఇద్దరు. ఆఖరు ఐదు ఓవర్లలో ఈ జోడీ ఆడితే.. వీరిని ఆపటం ఎవరితరం కాదు. అయితే రషీద్‌ ఖాన్‌పై ఈ హిట్టర్లకు పెద్ద రికార్డు లేదు. రషీద్‌ ఖాన్‌పై పొలార్డ్‌ 67 బంతుల్లో 63 పరుగులు చేసి.. ఓ సారి వికెట్‌ కోల్పోయాడు. హార్దిక్‌ పాండ్య 28 బంతుల్లో 16 పరుగులే చేసి రెండు సార్లు వికెట్‌ ఇచ్చాడు.  ఈ ఇద్దరి కోసం రషీద్‌ ఖాన్‌ ఓవర్లను సన్‌రైజర్స్‌ అట్టిపెట్టుకునే అవకాశం లేకపోలేదు.

5. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లు ముఖాముఖి 14 మ్యాచుల్లో తలపడ్డాయి. ఏడు మ్యాచుల్లో ముంబయి విజయం సాధించగా.. మరో ఏడు మ్యాచుల్లో హైదరాబాద్‌ పైచేయి సాధించింది. నేడు విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

6. ముంబయి ఇండియన్స్‌ విదేశీ పేసర్‌ ట్రెంట్ బౌల్ట్‌కు నేడు 150వ టీ20 మ్యాచ్‌ కానుంది. నాలుగు మ్యాచుల్లో రాణించిన బౌల్ట్‌ మైలురాయి మ్యాచ్‌లోనూ మెరువటం ఖాయమే.

7. డెవిడ్‌ వార్నర్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నాయకుడిగా ఇది 50వ మ్యాచ్‌. సీజన్‌లో ఇప్పటివరకు అర్థ సెంచరీ చేయని వార్నర్‌ స్పెషల్‌ మ్యాచ్‌లో కొడతాడేమో చూడాలి. ఇక మనీశ్‌ పాండే 3000 ఐపీఎల్‌ పరుగులకు 40 పరుగుల దూరంలో ఉన్నాడు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

ముంబయి ఇండియన్స్‌ : క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, జేమ్స్‌ పాటిన్సన్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డెవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), మనీశ్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్‌, అభిషేక్‌ శర్మ, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌/సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, టి.నటరాజన్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios