Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ వర్సెస్ ముంబై : నీదీ నాదీ ఒకే కథ

పంజాబ్, ముంబయిలు సాధించిన ఒక్క విజయంలో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించాయి. రెండు ఓటముల్లో ఓ మ్యాచ్‌కు సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. సూపర్‌ ఓవర్‌లో తేలిన మ్యాచ్‌లో రెండు జట్లూ పరాజయం పాలయ్యాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ చేతిలో ముంబయి చివరి మ్యాచ్‌లో ఓడగా.. భారీ స్కోర్ల షార్జా మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ పరాజయం పాలైంది. 

IPL 2020: MI VS KXIP Match Preview, Playing XI Head To Head Stats, Records, Fantasy Picks
Author
Dubai - United Arab Emirates, First Published Oct 1, 2020, 3:40 PM IST

నీదీ నాదీ ఒకే కథ. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబయి ఇండియన్స్‌కు ఈ టైటిల్‌ అతికినట్టు సరిపోతుంది. మూడు మ్యాచులు, ఓ విజయం, రెండు ఓటములు. ఐపీఎల్‌ 2020 తొలి పది రోజుల అనంతరం ఈ రెండు జట్ల పరిస్థితి ఇది. 

పంజాబ్, ముంబయిలు సాధించిన ఒక్క విజయంలో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించాయి. రెండు ఓటముల్లో ఓ మ్యాచ్‌కు సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. సూపర్‌ ఓవర్‌లో తేలిన మ్యాచ్‌లో రెండు జట్లూ పరాజయం పాలయ్యాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ చేతిలో ముంబయి చివరి మ్యాచ్‌లో ఓడగా.. భారీ స్కోర్ల షార్జా మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ పరాజయం పాలైంది. 

చివరి మ్యాచుల్లో అద్భుతంగా ఆడినా, ఎక్కడ మ్యాచ్‌ చేజారిందో తెలియని పరిస్థితి ఇరు జట్లదీ. జీర్ణించుకోలేని ఓటమితోనే ముంబయి, పంజాబ్‌లు నేడు ముఖాముఖికి సై అంటున్నాయి. అబుదాబి వేదికగా నేడు ముంబయి, పంజాబ్‌ తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు స్టార్‌స్పోర్ట్స్‌లో మ్యాచ్‌ ప్రసారం కానుంది.  డిజిటల్‌ మీడియాలో డిస్నీ హాట్‌స్టార్‌లోనూ మ్యాచ్‌ను వీక్షించవచ్చు.

5 వేలకు ఇక రెండే!:

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో ఐదు వేల పరుగుల మైలురాయికి చేరువగా ఉన్నాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ 4998 పరుగులతో ఉన్నాడు. నేడు పంజాబ్‌తో మ్యాచ్‌లో మరో రెండు పరుగులు చేస్తే చాలు రోహిత్‌ శర్మ ఐదు వేల పరుగుల క్లబ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. 

ఐదు వేల క్లబ్‌లో ఇప్పటికే విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనాలు ఉన్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌ లైనప్‌లో ముంబయికి పెద్దగా సమస్యలు లేవు. యువ కెరటం ఇషాన్‌ కిషన్‌ (99) సూపర్‌ ఇన్నింగ్స్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌కు మరో స్టార్‌ దొరికాడు.  

ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచటంలో విఫలమవుతున్నాడు. ఓ భారీ ఇన్నింగ్స్‌పై కన్నేసిన డికాక్‌.. నేడు పంజాబ్‌పై మెరవాలని చూస్తున్నాడు. కీరన్‌ పొలార్డ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు ఫామ్‌లో ఉన్నారు. పాండ్య సోదరులు పూర్తి స్థాయిలో మెరిస్తే ముంబయికి తిరుగుండదు. 

బౌలింగ్‌ విభాగంలో ముంబయి మెరుగు పడాలని చూస్తోంది. స్టార్‌ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా ఇంకా గాడిలో పడలేదు. బెంగళూర్‌తో మ్యాచ్‌లో బుమ్రా ఓవర్‌కు పదికి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. గాయం నుంచి కోలుకుంటే నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ నేడు బుమ్రాతో జోడీకట్టే అవకాశం కనిపిస్తోంది. రాహుల్‌ చాహర్‌తో కలిసి కృనాల్‌ పాండ్య స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు.  ఫామ్‌లో ఉన్న ట్రెంట్‌ బౌల్ట్‌ మరోసారి బంతితో ముంబయిని నడిపించనున్నాడు.

లోపమెక్కడ?:

అన్ని విభాగాల్లోనూ మెరుగ్గానే ఉంది. అయినా, ఎందుకు ఫలితం ప్రతికూలంగా వచ్చిందో తెలియని పరిస్థితి పంజాబ్‌ది. బ్యాటింగ్‌ లైనప్‌తో పాటు బౌలింగ్‌ బృందం సైతం పంజాబ్‌కు పటిష్టంగానే ఉన్నాయి. భారత పేసర్‌ మహ్మద్‌ షమి, విండీస్‌ యువ పేసర్‌ షెల్డన్‌ కాట్రెల్‌లు ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అంచనాలు అందుకుంటున్నాడు. జేమ్స్‌ నీషమ్‌, మురుగన్ అశ్విన్‌లు గాడిలో పడితే చాలు. 

ఇక బ్యాటింగ్‌ లైనప్‌లో పంజాబ్‌ భీకరంగా కనిపిస్తోంది. ఐతే ఓపెనర్ల కళ్లుచెదిరే ప్రదర్శనే ఆ జట్టును ఉత్కంఠ మ్యాచుల్లో వెనక్కి నెడుతుందేమో అనిపిస్తోంది!. కెఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లు ఇప్పటికే సీజన్‌లో చెరో సెంచరీతో జోరు మీదున్నారు. 

గ్లెన్‌ మాక్స్‌వెల్‌, నికోలస్‌ పూరన్‌ వంటి బిగ్‌ హిట్టర్లున్న జట్టులో రాహుల్‌, మయాంక్‌లే 76 శాతం పరుగులు కొట్టేశారు. పంజాబ్‌ మిడిల్‌ ఆర్డర్‌కు ఈ ఓపెనింగ్‌ జోడీ పెద్దగా చెలరేగే అవకాశం ఇవ్వలేదు. అబుదాబిలో తొలి మ్యాచ్‌ ఆడనున్న పంజాబ్‌ ఇక్కడ ఎటువంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో చూడాలి.

అవీ ఇవీ..:

1. ఐపీఎల్‌ 2020లో బుమ్రా డెత్‌ ఓవర్ల ఎకానమీ రేటు 14.6. గత సీజన్‌లో బుమ్రా గణాంకాలు 7.8. లాక్‌డౌన్ తర్వాత బుమ్రా ఇంకా గాడిలో పడలేదు. అయితే ఓవర్‌కు పదికి పైగా పరుగులు ఇచ్చిన ప్రతిసారీ బుమ్రా గొప్పగా పుంజుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో బుమ్రా ప్రియ ప్రత్యర్థి పంజాబ్‌. ఆ జట్టుపై బుమ్రా  సగటు 20.3, ఎకానమీ రేటు 6.5 ఉత్తమంగా ఉన్నాయి.

2. కెఎల్‌ రాహుల్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. వరల్డ్‌ క్లాస్‌ పేసర్‌ బుమ్రాపై ఆడేందుకు రాహుల్‌ ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తాడు. కానీ పవర్‌ ప్లే ముగిసిన తర్వాత స్పిన్‌ బౌలింగ్‌లో రాహుల్‌ ప్రదర్శన ఆందోళనకరంగా ఉంది. పవర్‌ ప్లేలో స్పిన్‌పై 252 స్ర్టయిక్‌రేట్‌తో ప్రతి 2.5 బంతులకు ఓ బౌండరీ బాదే రాహుల్‌.. ఫీల్డింగ్‌ ఆంక్షలు తొలగించిన తర్వాత స్టయిక్‌రేట్‌ 121కు, బౌండరీ రేటును 10.7కు పడిపోతున్నాడు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

ముంబయి ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), సూర్య కుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, జేమ్స్‌ పాటిన్సన్‌/ నాథన్‌ కౌల్టర్‌నైల్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, నికోలస్‌ పూరన్‌, జేమ్స్‌ పాటిన్సన్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌, మురుగన్‌ అశ్విన్‌, షెల్డన్‌ కాట్రెల్‌, మహ్మద్‌ షమి. 

Follow Us:
Download App:
  • android
  • ios