ధోనీ... ధోనీ... క్రికెట్‌లో ఈ పేరు ఓ సంచలనం. స్టేడియంలో ధోనీ ఉంటే చాలు... మ్యాచ్‌పై ఆశలు ఉంచుకోవచ్చు. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో జనాల్లోకి వెళ్లిన క్రికెటర్ ధోనీ ఒక్కటే. మాస్, క్లాస్ అని తేడా లేకుండా ధోనీ ఆడుతుంటే చూడాలని ప్రతీ క్రికెట్ ఫ్యాన్ ఆశగా కోరుకుంటాడు.

భారత జట్టుకు రెండు వరల్డ్‌కప్స్ అందించిన ధోనీ... చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టును మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. ఆడిన ప్రతీ సీజన్‌లో ప్లేఆఫ్‌కి అర్హత సాధించిన ఒకే ఒక్క జట్టు కూడా సూపర్ కింగ్స్. అయితే ఈసారి మాత్రం ధోనీకి, ధోనీ ఫ్యాన్స్‌కి చాలా ప్రత్యేకం.

జూలై 2019లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ క్రికెట్ ఆడలేదు. వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా బ్యాటింగ్ చేశాడు ధోనీ. వర్షం కారణంగా జూలై 9, 10 రెండు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన ధోనీ, కీలక సమయంలో రనౌట్ అయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీకి అదే ఆఖరి మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయిన ధోనీ, చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రనౌట్ అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు సరిగ్గా 436 రోజుల తర్వాత ధోనీ క్రీజులోకి రాబోతున్నాడు.

ఆగస్టు 15, 2020న క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్న ప్రకటించిన ధోనీ, రిటైర్ అయిన 34 రోజుల తర్వాత ఐపీఎల్ ఆడబోతున్నాడు. దాంతో అందరి చూపు మాహీ ఎలా ఆడతాడనే దానిపైనే ఉంది. అయితే ధోనీ చాలా ప్రెష్ మైండ్‌తో ఉన్నాడని, క్రీజులోకి దిగేందుకు చాలా ఉత్సాహంతో ఉన్నాడని తెలిపాడు సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్.