Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌ వర్సెస్ పంజాబ్‌:‌ ఎవరు గెలవాలన్నా ఇదే వ్యూహం..!

హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, దేశవాళీ మెరుపులతో సూపర్‌ విజయం సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లు నేడు చావోరేవో సమరానికి సిద్ధమయ్యాయి. 

IPL 2020: KXIP VS SRH Match preview, Stats, Head To Head, Fantasy Picks Pitch Report And  Probable Playing Eleven SRH
Author
Hyderabad, First Published Oct 24, 2020, 1:38 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పది మ్యాచుల్లో నాలుగేసి విజయాలు. ఆరు పరాజయాలు. లీగ్‌ ప్రథమార్థం మ్యాచుల్లో గెలువాల్సిన చోట.. చేజేతులా ప్రత్యర్థికి అప్పగించారు. ఇప్పుడు  చావోరేవో అన్న పరిస్థితుల్లో సర్వ శక్తలూ ఒడ్డుతూ విజయం కోసం పోరాడుతున్నాయి. అవే సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌లు. 

హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, దేశవాళీ మెరుపులతో సూపర్‌ విజయం సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లు నేడు చావోరేవో సమరానికి సిద్ధమయ్యాయి. 

నేడు దుబాయ్‌లో రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌, పంజాబ్‌ మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఓటమి టాప్‌-4లో చోటు గల్లంతు చేయనుంది, అందుకే సమవుజ్జీల సమరంలో విజయమే అంతిమ లక్ష్యం.

మ్యాచ్‌లో వ్యూహానికి ఇవి కీలకం

1.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌. కానీ అతడికి చెక్‌ పెట్టేందుకు పంజాబ్‌ వద్ద క్రిస్‌ గేల్‌ రూపంలో బ్రహ్మాస్ర్తం ఉంది. 2018 నుంచి లెగ్‌ స్పిన్‌పై క్రిస్‌ గేల్‌ 201 స్ర్టయిక్‌రేట్‌తో 57.7 సగటుతో పరుగులు సాధించాడు. రషీద్‌ ఖాన్‌పై 45 బంతుల్లోనే 79 పరుగులు పిండుకున్నాడు. రషీద్‌ ఖాన్‌కు కేవలం మూడు సార్లే వికెట్‌ కోల్పోయాడు. సందీప్‌ శర్మకు గేల్‌పై మంచి రికార్డుంది. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో నాలుగుసార్లు వికెట్‌ పడగొట్టాడు. సందీప్‌పై గేల్‌ 54 బంతుల్లో 64 పరుగులే చేశాడు.

2. ఈ ఐపీఎల్ పంజాబ్‌ కెప్టెన్ కెఎల్‌ రాహుల్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. కానీ స్పిన్నర్లను ఎదుర్కొవటంలో రాహుల్‌ ఇబ్బంది పడుతున్నాడు. ఈ సీజన్‌లో స్పిన్‌పై 117 బంతుల్లో 115 పరుగులే చేశాడు. పవర్‌ ప్లేలో కెఎల్‌ రాహుల్‌పైకి సన్‌రైజర్స్‌ రషీద్‌ ఖాన్‌ను ప్రయోగించే అవకాశం ఉంది. రషీద్‌కు రెండు సార్లు వికెట్‌ కోల్పోయిన రాహుల్‌.. 24 బంతుల్లో 16 పరుగులే చేశాడు.

3. పంజాబ్‌, హైదరాబాద్ ముఖాముఖి మ్యాచుల్లో సన్‌రైజర్స్‌దే పైచేయి. 15 మ్యాచుల్లో ఆరెంజ్‌ ఆర్మీ ఏకంగా 11 సార్లు విజయాలు సాధించింది.

4. ఈ ఐపీఎల్‌లో దుబాయ్‌లో 18 మ్యాచులు జరిగాయి. అందులో 12 మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టనే విజయం వరించింది.

5. విండీస్‌ యువ విధ్వంసకారుడు నికోలస్‌ పూరన్‌  ఈ సీజన్లలో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు అతడు 22 సిక్సర్లు బాదాడు. 22 సిక్సర్లకు తోడు 21 ఫోర్లతో పూరన్‌ ధనాధన్‌లో కొత్త రికార్డలు నెలకొల్పుతున్నాడు. డెత్‌ ఓవర్లలో అతడిని ఆపటం సన్‌రైజర్స్‌కు సవాల్‌తో కూడిన వ్యవహారమే.

6. పంజాబ్‌, హైదరాబాద్‌ సీజన్‌లో తలపడిన తొలి మ్యాచులో జానీ బెయిర్‌స్టో 97 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. వార్నర్‌, బెయిర్‌స్టోకు తోడు మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌లు సైతం ఫామ్‌లోకి వచ్చారు. హైదరాబాద్‌ను ఆపేందుకు పంజాబ్‌ బౌలర్లు మరింత కష్టపడాల్సిందే.

7. సన్‌రైజర్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయంతో రాజస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. నేడు అతడు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించినా తుది జట్టులోకి రావటం అనుమానమే. విండీస్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌తోనే వార్నర్‌ కొనసాగే వీలుంది. నాణ్యమైన పేస్‌ బౌలర్‌తో పాటు లోయర్‌ ఆర్డర్‌లో ధనాధన్‌ బ్యాటింగ్‌ మెరుపులు హోల్డర్‌ అందించగలడు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ : కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దీపక్‌ హుడా, జేమ్స్‌ నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌, మహ్మద్‌ షమి, అర్షదీప్‌ సింగ్‌.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్: డెవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌, ప్రియమ్‌ గార్గ్‌, అబ్దుల్‌ రషీద్‌, జేసన్‌ హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌, షాబాజ్‌ నదీమ్‌, సందీప్‌ శర్మ, టి.నటరాజన్‌.   

Follow Us:
Download App:
  • android
  • ios