Asianet News TeluguAsianet News Telugu

సునీల్ నరైన్‌ మెడపై సస్పెన్షన్‌ కత్తి: ఐపీఎల్‌ వార్నింగ్‌ లిస్ట్‌లో కోల్‌కత స్టార్‌

పంజాబ్ తో మ్యాచులో మ్యాచ్‌లో అనుమానాస్పద బౌలింగ్‌ యాక్షన్‌పై ఫీల్డ్‌ అంపైర్లు నరైన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. ఐపీఎల్‌ వార్నింగ్‌ లిస్ట్‌లో సునీల్‌ నరైన్‌ పేరును చేర్చారు.

IPL 2020: KKR's Star Player Sunil Narine Reported For Illegal Bowling Action
Author
Dubai - United Arab Emirates, First Published Oct 11, 2020, 8:19 AM IST

కోల్‌కత నైట్‌రైడర్స్‌ స్టార్‌ ఆటగాడు, వరల్డ్‌ క్లాస్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌పై సస్పెన్షన్‌ కత్తి వేలాడుతోంది. శనివారం పంజాబ్ తో మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌ విజయానికి బాటలు వేశాడు. 2/28తో పంజాబ్ కట్టడి చేశాడు. డెత్‌ ఓవర్లలో 18, 20 ఓవర్లు వేసిన నరైన్‌.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ ఆశలను ఆవిరి చేశాడు.  

ఉత్కంఠ మ్యాచ్‌లో అద్బుత విజయం అందించిన ఆనందం నరైన్‌కు ఎంతోసేపు నిలువలేదు. పంజాబ్ తో మ్యాచులో మ్యాచ్‌లో అనుమానాస్పద బౌలింగ్‌ యాక్షన్‌పై ఫీల్డ్‌ అంపైర్లు నరైన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. ఐపీఎల్‌ వార్నింగ్‌ లిస్ట్‌లో సునీల్‌ నరైన్‌ పేరును చేర్చారు.

'ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లు ఉల్హాస్‌ గాంధే, క్రిస్‌ గఫానెలు నివేదిక రూపొందించారు. ఐపీఎల్‌ అనుమానాస్పద అక్రమ బౌలింగ్‌ యాక్షన్‌ పాలసీ ప్రకారం సునీల్‌ నరైన్‌కు హెచ్చరిక జారీ చేశారు. నరైన్‌ను ప్రస్తుతం వార్నింగ్‌ జాబితాలో ఉంచారు. లీగ్‌లో అతడు బౌలింగ్‌ కొనసాగించవచ్చు. 

కానీ మరోసారి అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్‌ కొనసాగిస్తే.. ఐపీఎల్ 2020 నుంచి సస్పెండ్‌ చేయటం (కేవలం బౌలింగ్‌ చేయకుండా ఆదేశిస్తారు. బ్యాట్స్‌మన్‌గా జట్టులో కొనసాగవచ్చు) జరుగుతుంది. అనుమానిత బౌలింగ్‌ యాక్షన్‌లపై బీసీసీఐ కమిటీ తుది నిర్ణయం, క్లియరెన్స్‌ ఇచ్చిన పిమ్మటే తిరిగి బౌలింగ్‌ చేసేందుకు అనుమతి లభిస్తుంది' అని ఐపీఎల్‌ నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు.

అక్రమ, అనుమానాస్పద బౌలింగ్‌ యాక్షన్‌తో సునీల్‌ నరైన్‌ గతంలోనూ ఇరకాటంలో పడ్డాడు. 2015లో పల్లెకల్‌లో శ్రీలంకతో మూడో వన్డే అనంతరం నరైన్‌పై అంపైర్లు ఫిర్యాదు చేశారు. 

ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో నరైన్‌ బౌలింగ్ యాక్షన్‌ చర్చనీయాంశం కావటం అదే తొలిసారి. ప్రస్తుతం రద్దు చేయబడిన చాంపియన్స్‌ లీగ్‌ 2014లో సునీల్‌ నరైన్‌ రెండు సార్లు అక్రమ బౌలింగ్‌పై ఫిర్యాదు చేయబడ్డాడు. ఫలితంగా చాంపియన్స్‌ లీగ్‌ ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై నరైన్‌ బరిలోకి దిగే అవకాశం కోల్పోయాడు.

బౌలింగ్‌ యాక్షన్‌లో మార్పులు చేసుకున్న సునీల్‌ నరైన్‌.. 2015 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. అయినా, 2015 ఐపీఎల్‌లో నరైన్‌ మరోమారు పట్టుబడ్డాడు. బీసీసీఐ రీ టెస్ట్‌ తర్వాత ఆఫ్‌ స్పిన్నర్లు వేసేందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ అంతిమంగా ఆఫ్‌ స్పిన్నర్లు వేసేందుకు సైతం బీసీసీఐ ల్యాబ్‌ అనుమతి ఇచ్చింది. 2018 పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లోనూ నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై అంపైర్లు ఫిర్యాదు చేశారు.

2012 నుంచి కోల్‌కత నైట్‌రైడర్స్‌కు సునీల్‌ నరైన్‌ కీలక ఆటగాడు. ఆ సీజన్‌లో 5.47 ఎకానమితో 24 వికెట్లు కూల్చిన నరైన్‌, కోల్‌కత తొలి ఐపీఎల్‌ టైటిల్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2013 ఐపీఎల్‌లోనూ 5.46 ఎకానమీతో నరైన్‌ 22 వికెట్లతో సత్తా చాటాడు. 2014 ఐపీఎల్‌లో 21 వికెట్లు కూల్చిన నరైన్‌.. కోల్‌కత రెండోసారి ఐపీఎల్‌ ట్రోఫీ అందుకోవటంలో ముఖ్య భూమిక వహించాడు. 

2017 నుంచి నరైన్‌ను పించ్‌ హిట్టర్‌గానూ కోల్‌కత సద్వినియోగం చేసుకుంటోంది. 2017 ఐపీఎల్‌లో 172.3 స్ట్రయిక్‌రేట్‌తో 224 పరుగులు, 2018 ఐపీఎల్‌లో 189.89 స్ర్టయిక్‌రేట్‌తో 357 పరుగులు, 2019 ఐపీఎల్‌లో 166.27 స్ర్టయిక్‌రేట్‌తో 143 పరుగులు చేశాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలర్‌ బంతిని వదిలేటప్పుడు మోచేతిని 15 డిగ్రీలకు మించి వంచకూడదు. ఒకవేళ బౌలర్‌ అలా 15 డిగ్రీలకు మించి మోచేతిని వంచితే, ఆ బంతిని అక్రమ బౌలింగ్‌ యాక్షన్‌ బంతిగా పరిగణిస్తారు. అంపైర్‌ ఆ బంతికి వికెట్‌ పడితే, నాటౌట్‌గా ప్రకటించే అధికారం కలిగి ఉంటాడు.  ఐపీఎల్‌ 2020లో సునీల్‌ నరైన్‌ మరోసారి ఇలా అక్రమ బౌలింగ్‌ యాక్షన్‌తో పట్టుబడితే.. బయో బబుల్‌ సీజన్‌కూ దూరమైనట్టే లెక్క!. 

Follow Us:
Download App:
  • android
  • ios