Asianet News TeluguAsianet News Telugu

IPL2020: రన్ రాజా రన్ అంటున్న ఈ సీజన్ ప్రత్యేకతలు ఇవే...

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 13 సీజన్‌ అభిమానులకు కొత్త అనుభూతిని మిగల్చనుంది.

IPL 2020: From Bio Secure Bubble To Virtual Press meets, Here Arfe The Specialities Of This Edition Of IPL
Author
Abu Dhabi - United Arab Emirates, First Published Sep 19, 2020, 11:41 AM IST

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన మన అభిమాన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) రానే వచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌ నుంచి తరలిపోయిన ఐపీఎల్‌ నేటి నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఈ)లో జరుగనుంది.

కరోనా వైరస్‌తో తొలుత మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 15కు వాయిదా పడిన ఐపీఎల్‌2020.. అనంతరం నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

బయో సెక్యూర్‌ బబుల్‌ వాతావరణంలో మూడు నగరాల్లో మాత్రమే ఐపీఎల్‌ నిర్వహణకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వేగంగా పావులు కదిపింది. కరోనా వైరస్‌, ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌, ఆసియా కప్‌, ఇతర ద్వైపాక్షిక సిరీస్‌లు, విదేశాల్లో నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, విదేశీ స్పాన్సర్‌షిప్‌లపై ప్రజల్లో పెల్లుబికిన వ్యతిరేకత.. ఇలా ఎన్నో విఘ్నాలను అధిగమించిన ఐపీఎల్‌.. నేడు అబుదాబిలో ఆరంభ మ్యాచ్‌తో షురూ కానుంది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 13 సీజన్‌ అభిమానులకు కొత్త అనుభూతిని మిగల్చనుంది.

బయో సెక్యూర్‌ బబుల్‌

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ను బయో సెక్యూర్‌ బబుల్‌లో నిర్వహిస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ అబుదాబి, దుబాయి, షార్జాల్లో మూడు బయో సెక్యూర్ బబుల్స్ ను సృష్టించింది. 

క్రికెటర్లు, సహాయక సిబ్బంది, మైదాన సిబ్బంది, మ్యాచ్‌ అధికారులు, నిర్వహణ బృందం, ప్రాంఛైజీ బృందాలు, రవాణా సిబ్బంది మినహా బయటి వ్యక్తులను ఎవరినీ బబుల్‌లోకి అనుమతించరు. 

వ్యాఖ్యాతలు, ప్రసారుదారు స్టార్‌స్పోర్ట్స్‌ సిబ్బంది అవుటర్‌ బబుల్‌లో ఉంటారు. ఆటగాళ్లందరికీ జియో ట్రాకింగ్‌ ఉంటుంది. బబుల్‌లో ఎక్కడి తిరిగారనే సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. వైద్య సదుపాయం సైతం బుడగ వాతావరణంలోనే అందుబాటులో ఉండనుంది.

మూడే వేదికలు, ఖాళీ స్టేడియాలు : 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12 ఏండ్ల చరిత్రలో తొలిసారి మూడు వేదికలకు మాత్రమే పరిమితం కానుంది. భారత్‌లో 8-10 వేదికలు (కొన్ని ప్రాంఛైజీలు రెండు ఆతిథ్య వేదికలు కలిగి ఉండేవి) ఆతిథ్యం ఇవ్వగా.. యుఏఈలో దుబాయి, అబుదాబి, షార్జాలు వేదికలుగా నిలుస్తున్నాయి. 

ఇక ఈ మూడు వేదికల్లోనూ అభిమానులకు అనుమతి లేదు. ఖాళీ స్టేడియాల్లో క్రికెట్‌ మ్యాచులకు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ క్రికెటర్లు కాస్త అలవాటు పడ్డారు. కిక్కిరిసిన స్టేడియాల్లో మ్యాచులకు ఐపీఎల్‌ ఫేమస్. ఇప్పుడు అభిమానుల సందడి లేకుండానే ఐపీఎల్‌ సాగిపోనుంది.

వర్చువల్‌ ప్రెస్‌ మీట్స్‌!

ఐపీఎల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఎక్కువ. అందుకు తగినట్టే లీగ్‌ వార్తలు, ప్రత్యేక కథనాలు అందించేందుకు మీడియా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటుంది. కరోనా కారణంగా బుడగలో జరుగుతున్న ఐపీఎల్‌కు పాత్రికేయులకు సైతం ప్రవేశం కల్పించలేదు. 

యుఏఈ స్పోర్ట్స్‌ రిపోర్టర్లకు సైతం బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. అయినా, మ్యాచ్‌ అనంతరం నిర్వహించే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లను యథావిధిగా ఏర్పాటు చేయనున్నారు. వర్చువల్‌ ప్రెస్‌ మీట్‌తో క్రికెటర్లు పాత్రికేయులతో మాట్లాడనున్నారు. ఇంగ్లాండ్‌ బయో సెక్యూర్‌ సిరీస్‌ల్లో జర్నలిస్ట్‌లకు అనుమతి కల్పించారు. కానీ యుఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌కు బీసీసీఐ అనుమతి నిరాకరించింది.

ఉత్కంఠ, ఆందోళన

ఐపీఎల్‌ అనగానే నరాలు తెగే ఉత్కంఠకర మ్యాచులకు కేరాఫ్‌ అడ్రస్‌. క్రికెట్‌ పోటీతత్వంలో ఎటువంటి మార్పు లేకపోయినా, క్రికెటర్ల మానసిక స్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. 

అభిమానులు లేకుండా జరుగుతున్న ఐపీఎల్‌ కొంతమందికి అనుకూలంగా ఉండనుండగా.. ప్రేక్షకుల కేరింతల నడుమ మరింత రెచ్చిపోయే అలవాటున్న క్రికెటర్లకు ఇది ప్రతికూల పరిణామమే. సుదీర్ఘకాలం క్రికెట్‌కు దూరమై ఇప్పుడే మైదానంలోకి అడుగుపెడుతున్న క్రికెటర్లకు ఇప్పుడు ఉత్కంఠకు ఆందోళన తోడైంది. 

కుటుంబాలకు దూరంగా హౌటల్‌ గదుల్లో ఒంటరిగా గడుపుతున్న క్రికెట ర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు అన్ని ప్రాంఛైజీలు మానసిక నిపుణులనునియ మించుకు న్నాయి. మాన సిక ఫిట్‌నెట్‌ కలిగిన జట్లు ప్రత్యర్థులపై సహజంగానే పైచేయి సాధించనున్నాయి.

ధనాధన్‌ కాదు రన్‌ రాజా రన్‌!

గణాంకాలు, సమీకరణాలు, వ్యూహలు, ప్రణాళికలు.. ఇలా ఐపీఎల్‌ అనగానే ప్రాంఛైజీలు తలమునకలై ఉంటాయి. ఊహించని పరిస్థితుల్లో యుఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌కు జట్లు కొత్తగా ప్రణాళికలు రచించుకున్నాయి. 

బలాబలాలు, ఎత్తు పైఎత్తులు వేగంగా మారిపోతున్నాయి. భారత్‌లో భారీ స్కోర్లకు పెట్టింది పేరు ఐపీఎల్‌. కానీ యుఏఈలో స్వల్ప స్కోర్లకు పరిమితం కానుంది. బ్యాట్స్‌మెన్‌ భారీ షాట్లతో ధనాధన్‌కు వెళ్లకుండా.. వికెట్ల మధ్య పరుగు తీసేందుకు రన్‌రాజారన్‌ అంటేనే గెలుపు ఫార్ములా అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతూ ఐపీఎల్‌ మన టివిలో సందడి చేసేందుకు వచ్చేసింది. క్రికెట్‌ విన్యాసాల విందుకు అభిమానులూ సిద్ధంగా ఉండండి!.

Follow Us:
Download App:
  • android
  • ios