షార్జా: చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ వికెట్ల వెనక అద్భుతమైన ప్రదర్శన చేశాడు. పక్షిలా ఎగిరి బంతిని ఒంటి చేత్తో అందుకుని బెన్ స్టోక్స్ ను పెవిలియన్ చేర్చాడు. ఈ క్యాచ్ ను దినేష్ కార్తిక్ అందుకున్న తీరును చూసి బెన్ స్టోక్స్ కూడా కాసేపు ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు. 

కేకేఆర్ తమ ముందు ఉంచిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన బెన్ స్టోక్స్ ధాటిగా ఆడడం ప్రారంభించాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ బెన్ స్టోక్స్ కు రౌండ్ ద వికెట్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ చేశాడు. కమిన్స్ వేసిన బంతిని బౌండరీ దాటించే ప్రయత్నం చేశాడు. అయితే, అది బ్యాట్ అంచును ముద్దాడింది. 

బెన్ స్టోక్స్ కొట్టిన బంతి తనకు దూరంగా దూసుకుపోతున్న వైనాన్ని గమనించిన దినేష్ కార్తిక్ ఒక్కసారిగా పక్షిలా ఎగిరి దాదాపు ఫస్ట్ స్లిప్ స్థానంలో ఒంటి చేత్తో అందుకున్నాడు. ఆ బంతిని దినేష్ కార్తిక్ పట్టిన తీరుకు ఆశ్చర్యపోయిన వ్యాఖ్యాత మార్క్ నికోలస్ తాను పక్షిలా ఎగిరాడని అన్నాడు. బెన్ స్టోక్స్ ను అవుట్ చేసిన ఊపులో కేకేఆర్ అదే దూకుడు ప్రదర్శించింది. వరుసగా వికెట్లు పడగొడుతూ వెళ్లింది. 

బ్యాటింగ్ లో విఫలమైన దినేష్ కార్తిక్ వికెట్ల వెనక మాత్రం ఆదివారం జరిగిన మ్యాచులో అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.