భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని మైదానంలోకి అడుగుపెడుతున్నాడన్న వార్త రాగానే... సోషల్ మీడియా అంతా తలా, ధోని అంటూ తెగ ట్రెండ్ అవుతున్నాయి. 

ఆయన చెన్నైలో ల్యాండ్ అవుతున్నాడన్నది మొదలు క్రికెట్ ప్రపంచమంతా కూడా ధోని పునరాగమనం అంటూ తెగ సంబరపడిపోతున్నారు. తాజాగా ఐపీఎల్ ప్రారంభమవనున్న నేపథ్యంలో ఇప్పటికే ధోని ప్రాక్టీసును ఆరంభించేందుకు చెన్నై చేరుకున్నాడు. లేటెస్ట్ ప్రాక్టీస్ సెషన్ లో ధోని 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టి తనలోని పస ఇంకా ఏ మాత్రము తగ్గలేదని నిరూపించే ప్రయత్నం చేసాడు. 

ప్రాక్టీస్ సెషన్లో తనలోని పస ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ ధోని 5 బంతుల్లో 5 సిక్సులు కొట్టిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దాన్ని చూసిన అభిమానులు సంబరం చేసుకుంటున్నారు. ఇక ఎవర్ గ్రీన్ చర్చ ఏదైతే ఉందొ ధోని కం బ్యాక్ ఇన్ టీం ఇండియా అనేది అదిప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. 

ఇకపోతే ఈ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెన్నైలో ల్యాండ్ అవగానే ఘన స్వాగతం లభించింది. ఐపీఎల్ 2020 ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోనీ చెన్నై చేరుకున్నారు. ఐపీఎల్ టీ20కి జట్టును సంసిద్ధం చేయడానికి ఆయన చెన్నై వచ్చారు. 

38 ఏళ్ల ధోనీకి స్వాగతం చెబుతున్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేసింది. వీడియోను పోస్టు చేస్తూ దానికి కామెంట్స్ ను జత చేసింది.

శిక్షణా శిబిరాన్ని మార్చి 19 తర్వాత ప్రారంభిస్తామని చెన్నై సూపర్ కింగ్స్ చెప్పినప్పటికీ ఆయన మాత్రం ముందుగానే వచ్చారు. 

2019లో న్యూజిలాండ్ పై ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో భారత్ ఓడిపోయిన తర్వాత ధోనీ భారత జట్టు తరఫున మైదానంలోకి దిగలేదు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ లతో సిరీస్ లకు ఆయన దూరమయ్యాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో జరిగిన సిరీస్ ల్లో కూడా అతను పాల్గొనలేదు. 

శుక్రవారంనాడు ధోనీ రాంచీలోని డియోరీ మా ఆలయంలో పూజలు చేశాడు. క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న ధోనీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అభిమానులను ఉత్సాహపరస్తూనే ఉన్నాడు. 

2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కు నాయకత్వం వహిస్తున్నాడు. 2010, 2011, 2018ల్లో ఆయన చెన్నైకి మూడు టైటిళ్లు అందించారు. మార్చి 29వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో జరిగే తొలి మ్యాచులో చెన్నై తలపడుతుంది. ఐపిఎల్ ఫైనల్ మే 24వ తేదీన జరుగుతుంది.