షార్జా: ఈ ఐపిఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆటగాడు దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఐపిఎల్ సీజన్ లో పడిక్కల్ ఇప్పటికే ఐదు అర్థ సెంచరీలు చేశాడు. సోమవారం ఢిల్లీపై జరిగిన మ్యాచులో అతను అర్థ సెంచరీ చేశాడు. 

ఐపిఎల్ సీజన్ లో ప్రవేశించన వెంటనే అన్ క్యాప్డ్ ప్లేయర్ గా అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా పడిక్కల్ రికార్డు సృష్టించాడు. కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల పడిక్కల్ తద్వారా శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ ల రికార్డును బద్దలు కొట్టాడు. శిఖర్ ధావన్ 2008లో, శ్రేయస్ అయ్యర్ 2015లో నాలుగు అర్థ సెంచరీలతో రికార్డును పంచుకుంటున్నారు. ఈ ఇద్దరు కూడా గతంలోని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ఆడిన సమయంలోనే ఆ రికార్డు సృష్టించారు. 

సోమవారం ఢిల్లీపై జరిగిన మ్యాచులో కూడా పడిక్కల్ ఆర్సీబీకి మంచి ప్రారంభాన్ని అందించాడు. 40 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుత సీజన్ లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పడిక్కల్ కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. 14 ఇన్నింగ్సుల్లో పడిక్కల్ 472 పరుగుులు చేశాడు. మొత్తం 51 ఫోర్లు, ఎనిమిది సిక్స్ లు బాదాడు.