ఢిల్లీ క్యాపిటిల్స్ నిలకడగా రాణిస్తుండగా.. ధనాధన్ స్టార్స్‌తో కూడిన రాజస్థాన్ అంచనాలకు అందటం లేదు. ఆఖరు ఓవర్ వరకు ఇప్పుడు ఆ జట్టు విజయావకాశాలపై ఓ నిర్ణయానికి రాలేని పరిస్థితి.
ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం పోటీపడుతున్న జట్టు ఢిల్లీ క్యాపిటిల్స్. వరుసగా నాలుగు పరాజయాల అనంతరం సన్‌రైజర్స్‌పై ఓ ఊరట విజయంతో ఇప్పుడిప్పుడే మళ్లీ గెలుపు బాట పట్టిన జట్టు రాజస్థాన్ రాయల్స్.
ఈ రెండు జట్లు నేడు ముఖాముఖి తలపడనున్నాయి. విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కండరాల గాయంతో నేటి మ్యాచ్‌కు దూరమవటం ఢిల్లీకి ప్రతికూల పరిణామమే, కానీ మరో డ్యాషింగ్ ఆటగాడు అలెక్స్ కేరీ తుది జట్టులోకి రానున్నాడు.
ఢిల్లీ క్యాపిటిల్స్ నిలకడగా రాణిస్తుండగా.. ధనాధన్ స్టార్స్‌తో కూడిన రాజస్థాన్ అంచనాలకు అందటం లేదు. ఆఖరు ఓవర్ వరకు ఇప్పుడు ఆ జట్టు విజయావకాశాలపై ఓ నిర్ణయానికి రాలేని పరిస్థితి. బట్లర్, స్మిత్, సంజులకు తోడు రాహుల్ తెవాటియ, రియాన్ పరాగ్‌ల కోసం ఢిల్లీ బౌలర్లు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
మ్యాచ్‌కు ముందు సంగతులు..
1. యుఏఈ పిచ్‌లపై స్పిన్ ప్రధాన పాత్ర పోషించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో, రాజస్థాన్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడే ఆలోచన చేస్తుండగా.. ఢిల్లీ అదనంగా మణికట్టు మాయగాడు సందీప్‌ను తెచ్చేందుకు చూస్తోంది. వికెట్ కీపర్‌గా అలెక్స్ కేరీ రాకతో క్యాపిటల్స్ తన విదేశీ ఆటగాళ్లలో నోకియాను బెంచ్‌కు పరిమితం చేసే అవకాశం లేకపోలేదు. అయితే, ఇదేమీ ఢిల్లీకి అంత చిన్న నిర్ణయం కాదు.
2. రాయల్స్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌పై మంచి రికార్డుంది. పృథ్వీ షాను గోపాల్ రెండు సార్లు అవుట్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్‌నూ గోపాల్ రెండు సార్లు అవుట్ చేశాడు. గోపాల్‌పై షా 7, అయ్యర్ 8.5 సగటు మాత్రమే కలిగి ఉన్నారు. శిఖర్ ధావన్, మార్కస్ స్టోయినిస్‌లను సైతం గోపాల్ సులువుగా వెనక్కి పంపిన సందర్బాలు ఉన్నాయి. స్టీవ్ స్మిత్ పవర్ ప్లే నుంచే స్పిన్‌ను ప్రయోగించే అవకాశం లేకపోలేదు.
3. ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచులలో రాయల్స్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. 21 మ్యాచుల్లో 11-10తో రాయల్స్ పైచేయి సాధించింది. కానీ 2018లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 10 పరుగుల విజయం తర్వాత, ఢిల్లీపై రాయల్స్ నెగ్గనేలేదు. చివరి ఐదు మ్యాచుల్లో ఢిల్లీ ఏకంగా నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించింది.
4. టీ20 క్రికెట్‌లో 7500 పరుగులు మైలురాయి సాధించేందుకు, శిఖర్ ధావన్ మరో ఐదు పరుగుల దూరంలో ఉన్నాడు.
5. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 50 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు ఢిల్లీ పేసర్ కగిసో రబాడ 2 వికెట్ల దూరంలో నిలిచాడు. ఐపీఎల్ 2020లో వికెట్ల వేటలో దూసుకుపోతున్న రబాడ ఈ మ్యాచ్‌లో ఈ ఘనత అందుకోవటం లాంఛనమే.
6. కెరీర్ 200వ టీ20 మ్యాచ్ ఆడబోతున్న స్టీవ్ స్మిత్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 1000 పరుగులు మార్క్ చేరుకునేందుకు మరో 79 పరుగులు చేయాల్సి ఉంది.
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కేరి (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, నోకియా.
రాజస్థాన్ రాయల్స్: జోశ్ బట్లర్ (వికెట్ కపీర్), బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజు శాంసన్, రాబిన్ ఉతప్ప/యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియ, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగి, జైదేవ్ ఉనద్కత్.
