అబుదాబి: ఐపిఎల్ 2020లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచులో తమ విజయానికి గల కారణాన్ని సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ వివరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన మాట్లాడారు. డెత్ ఓవర్లలో తమ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్లనే విజయం సాధ్యమైందని ఆయన అన్నాడు. బౌలర్ల ఉత్తమ ప్దర్శన వల్లనే ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించగలిగినట్లు తెలిపాడు.

డెత్ ఓవర్లలో తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని, ఈ రోజు ప్రదర్శన అద్భుతంగా ఉందని వార్నర్ అన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాదు బౌలర్లలో రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణించారు రషీద్ ఖాన్ కేవలం 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 25 పరుగులు సమర్పించుకుని రెండు వికెట్లు పడగొట్టాడు. 

Also Read: ఐపిఎల్ 2020: ఢిల్లీ క్యాపిటిల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు షాక్

మిచెల్ మార్ష్ గాయపడడం వల్ల తొలి మ్యాచులో తమపై పడిన ప్రభావం గురించి కూడా వార్నర్ చెప్పాడు. ఐదో స్పెషలిస్టు బౌలరును మైదానంలోకి దింపే అవకాశం లేని సందర్భంలో అభిషేక్ శర్మ అద్బుతంగా బౌలింగ్ చేశాడని వార్నర్ అన్నాడు. 

దురదృష్టవశాత్తు మార్ష్ గాయపడ్డాడని, అందువల్ల కొన్ని ఓవర్ల విషయంలో ఏం చేయాలనే ఆందోళనకు గురైనప్పుడు అభిషేక్ శర్మ బాగా బౌలింగ్ చేశాడని అన్నాడు. తమ జట్టు బ్యాటింగ్ ప్రదర్శనను కూడా ఆయన కొనియాడాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి  సన్ రైజర్స్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. హైదరాబాదు సన్ రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు 45 బంతుల్లో 53 పరుగులు చేయడమే కాకుండా తొలి వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

అక్టోబర్ 2వ తేదీన సన్ రైజర్స్ హైదరారబాదు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ అక్టోబర్ 3వ తేదీన కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఎదుర్కుంటుంది.