Asianet News Telugu

CSK VS SRH: జోరుమీదున్న హైదరాబాద్, రాయుడు చెన్నై రాత మార్చేనా..?

రెండు వరుస ఓటముల నుంచి కోలుకుని ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జోరు మీదుంది. నేడు దుబాయ్‌ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లు ముఖాముఖి తలపడనున్నాయి. మ్యాచ్‌ రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.
 

IPL 2020: CSK VS SRH Match preview, Stats, Head To Head, Fantasy Picks Pitch Report And  Probable Playing Eleven
Author
Hyderabad, First Published Oct 2, 2020, 11:55 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభంలో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ముందుంటుంది. యుఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2020లో కథ చెన్నైకి కాస్త విరుద్ధంగా సాగుతోంది!. 

సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో ధోనీసేన కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. అదీ ఆరంభ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై సాధించినదే. తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లోనూ సూపర్‌కింగ్స్‌ దారుణ పరాజయాలు చవిచూసింది. 

ఓటమి సంగతి పక్కనపెడితే, ఓడిన మ్యాచులలో ధోనీసేన అసలు రేసులోనే లేదు. వరుస ఓటమల అనంతరం ఆరు రోజుల విశ్రాంతి తీసుకున్న సూపర్‌కింగ్స్‌ నేడు మళ్లీ బరిలోకి దిగుతోంది. 

రెండు వరుస ఓటముల నుంచి కోలుకుని ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జోరు మీదుంది. నేడు దుబాయ్‌ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లు ముఖాముఖి తలపడనున్నాయి. మ్యాచ్‌ రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

రాయుడు వస్తున్నాడు.. రాత మారుస్తాడా?

ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అంబటి రాయుడు వీర విహారంతో చెన్నైకి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. తొడ కండరాల గాయంతో రాయుడు దూరమైన తర్వాతి రెండు మ్యాచుల్లో ధోనీసేన మట్టికరిచింది. నేడు హైదరాబాద్‌ మ్యాచ్‌లో రాయుడు తిరిగి జట్టులోకి వస్తున్నాడు. 

బ్యాటింగ్‌ లైనప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్‌కు రాయుడు తోడు కానున్నాడు. రాయుడి రాకతో చెన్నై మళ్లీ గెలుపు బాట పడుతుందేమో చూడాలి. చెన్నై స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో సైతం గాయం నుంచి కోలుకున్నాడు. నేడు మ్యాచ్‌ సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడు. 

కానీ అతడి స్థానంలో ఆడుతున్న యువ ఆటగాడు సామ్‌ కరన్‌ గొప్పగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌ తొలి పది రోజుల్లో కరన్‌ హవా నడిచింది. దీంతో బ్రావో మరిన్ని మ్యాచులు బెంచ్‌కు పరిమితం కావచ్చు. 

రాయుడు రాకతో ఓపెనర్‌ మురళీ విజయ్‌ బెంచ్‌పై కూర్చోనున్నాడు. దుబాయ్‌ పిచ్‌పై స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌, పేసర్‌ జోశ్‌ హెజిల్‌వుడ్‌లలో ఎవరు ఉపయుక్తం అనుకుంటే ధోని అతడిని తుది జట్టులోకి తీసుకోవచ్చు.

జోరుమీదున్న హైదరాబాద్‌

తొలి మ్యాచ్‌ను తృటిలో చేజార్చుకున్న హైదరాబాద్‌ వరుస ఓటముల అనంతరం కీలక విజయం సాధించింది.  కేన్‌ విలియమ్సన్‌ చేరికతో మిడిల్‌ ఆర్డర్‌ ఇప్పుడు బలోపేతమైంది. టాప్‌ ఆర్డర్‌లో డెవిడ్‌ వార్నర్‌ ఇంకా తనదైన ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. 

జానీ బెయిర్‌స్టో, మనీశ్‌ పాండేలు ఫామ్‌లో ఉన్నారు. కేన్‌ విలియమ్సన్‌ ఇక్కడి పిచ్‌లపై అలవోకగా బౌలర్లను ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బౌలర్లపై కేన్‌ వంద శాతం నియంత్రణ సాధించటం విశేషం. 

దుబాయ్‌లోనే జరుగుతున్న నేటి మ్యాచ్‌లో కేన్‌ విలియమ్సన్‌ హైదరాబాద్‌కు కీలకం కానున్నాడు. యువ ఆటగాళ్లు ప్రియం గార్గ్‌, అబ్దుల్‌ సమద్‌లు నిరూపించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. బౌలింగ్‌ విభాగంలో భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌, టి. నటరాజన్‌లు చెన్నైకి కట్టడి చేసేందుకు అస్త్రాలతో రెఢీగా ఉన్నారు.

అవీ... ఇవీ 

1. 2018 నుంచి దుబాయ్‌లో 55 మ్యాచులు జరుగగా.. అందులో 36 సార్లు టాస్‌ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే, ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టునే 29 సార్లు విజయం వరించింది. ఐపీఎల్ 2020లోనూ నాలుగు మ్యాచుల్లో జట్లు ఛేదనకు మొగ్గు చూపాయి. కానీ టాస్‌ నెగ్గిన జట్టు ఇక్కడ మ్యాచ్‌ నెగ్గలేదు. మంచు ప్రభావం కారణంగా ఛేదనకు మొగ్గుచూపుతున్నా, ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. మరి నేడు మ్యాచులో ఆ సమీకరణం మారుతుందేమో చూడాలి.

2. షేన్‌ వాట్సన్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పై మంచి రికార్డుంది. హైదరాబాద్‌తో చివరి ఐదు మ్యాచుల్లో వాట్సన్‌ రెండు అర్థ సెంచరీలు, ఓ సెంచరీ సాధించాడు. కానీ భువనేశ్వర్‌ కుమార్‌కు మూడు సార్లు వికెట్‌ కోల్పోయాడు. ఆరంభంలో భువిని అధిగమిస్తే.. మిడిల్‌లో రషీద్‌ ఖాన్‌పై విజృంభించటం వాట్సన్‌కు పెద్ద విషయం కాదు.

3. ఐపీఎల్‌లో విరివిగా అర్థ సెంచరీలు బాదటంలో డెవిడ్‌ వార్నర్ సిద్ధహస్తుడు. ప్రతి 2.69 ఇన్నింగ్స్‌కు వార్నర్‌ ఓ అర్థ సెంచరీ సాధించాడు. కానీ ఈ సీజన్‌లో మూడు మ్యాచులో ముగిసినా, వార్నర్‌ 50 ప్లస్‌ స్కోరు అందుకోలేదు. ఇక చెన్నైపై వార్నర్‌కు గొప్ప రికార్డుంది. సూపర్‌కింగ్స్‌పై ఆడిన చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ వార్నర్‌ అర్థ శతకం బాదాడు.

4. ఐపీఎల్‌ 2020లో అత్యధిక యార్కర్లు సంధించిన జట్టుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిలిచింది. సెప్టెంబర్‌ 30 వరకు జరిగిన మ్యాచుల్లో ఏ జట్టూ ఆరుకు మించి యార్కర్లు వేయలేదు. కానీ ఆరెంజ్‌ ఆర్మీ బౌలర్లు ఇప్పటికే 16 యార్కర్లతో విరుచుకుపడ్డారు. యార్కర్ల మిషిన్‌ టి.నటరాజన్‌ నేడు చెన్నైపైనా యార్కర్ల అస్త్రంతో సిద్ధంగా ఉన్నాడు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డెవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), మనీశ్ పాండే, కేన్‌ విలియమ్సన్‌, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌ శర్మ, ప్రియాం గార్గ్‌, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, టి. నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌.

చెన్నై సూపర్‌కింగ్స్‌: షేన్‌ వాట్సన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, శామ్‌ కరన్‌, కేదార్‌ జాదవ్‌, ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, పియూశ్‌ చావ్లా, ఇమ్రాన్‌ తాహీర్‌/జోశ్‌ హెజిల్‌వుడ్‌.  

Follow Us:
Download App:
  • android
  • ios