దుబాయ్: ట్వంటీ20ల్లో వేయి సిక్స్ లు బాదిన తొలి క్రికెటర్ గా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ఐపిఎల్ లో భాగంగా శుక్రవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచులో అతను ఆ రికార్డును సొంతం చేసుకున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడుతున్న క్రిస్ గేల్ శుక్రవారంనాటి మ్యాచులో కేవలం 63 బంతుల్లో 99 పరుగులు చేసి అదరగొట్టాడు. 

క్రిస్ గేల్ స్కోరులో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్స్ లు ఉన్నాయి. కార్తిక్ త్యాగి వేసిన షార్ట్ పిచ్ బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్స్ బాది వేయి సిక్స్ లు బాదిన క్రికెటర్ గా గేల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. క్రిస్ గేల్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆర్చర్ బౌలింగులో ఔటయ్యాడు. దాంతో గేల్ సెంచరీ చేయలేకపోయాడు. 

గేల్ ఐపిఎల్ తొలి అర్థ భాగం బెంచీకే పరిమితయ్యాడు. మైదానంలోకి దిగిన తర్వాత తన సత్తా ఏమిటో చాటుతున్నాడు ఆరు ఇన్నింగ్సు మాత్రమే ఇప్పటి వరకు ఆడిన గేల్ 23 సిక్స్ లు బాదాడు. ఈ సీజన్ లో అత్యధిక సిక్స్ లు బాదిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ మూడో స్థానంలో నిలిచాడు. 

గేల్ జట్టు సహచరుడు పూరన్  25 సిక్స్ లు బాది రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 పేరు చెప్తే మొదట గుర్తుకు వచ్చేది క్రిస్ గేల్.  ఐపిఎల్ లో 349 సిక్స్ లు బాదిన క్రిస్ గేల్ అగ్రస్థానంలో నిలిచాడు.  రెండో స్థానంలో నిలిచిన ఏబీ డీవిలియర్స్ అతనికి దరిదాపుల్లో కూడా లేడు. డీవీలియర్స్ 232 సిక్స్ లతో రెండో స్థానంలో ఉన్నాడు.