చెన్నై వర్సెస్  కోల్‌కత మ్యాచులో తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  కోల్‌కత 167 పరుగులకు ఆల్ అవుట్ అయింది.  కోల్‌కత టీం లయ దొరకబుచ్చుకునేందుకు బ్యాటింగ్ ఆర్డర్లో అనేక మార్పులను చేసింది. 

ఈ మార్పుల్లో భాగంగా రాహుల్ త్రిపాఠి శుభమన్ గిల్ తో కలిసి ఓపెనర్ గా వచ్చాడు. వచ్చింది మొదలు ఇన్నింగ్స్ ఆద్యంతం చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎవ్వరిని వదలకుండా, కనికరం చూపకుండా స్టేడియం నలువైపులా భారీ షాట్లనాడాడు. 

సెంచరీ పూర్తి చేసుకుంటాడు అనుకుంటున్నా తరుణంలో 81 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 8 ఫోరులు, మూడు సిక్సర్ల సహాయంతో కేవలం 51 బంతుల్లోనే 81 పరుగులు చేసాడు.

అవతలి పక్క టపటపా వికెట్లు పడుతున్నప్పటికీ.... రాహుల్ త్రిపాఠి మాత్రం ఎక్కడా కూడా తన ఏకాగ్రతను కోల్పోకుండా ఆడాడు. కేకేఆర్ చేసిన మార్పుల్లో కేవలం ఓపెనర్ గా రాహుల్ త్రిపాఠిని దింపడం మాత్రమే కలిసి వచ్చింది. 

కోల్‌కత టాప్ ఆర్డర్ లో ఈరోజు త్రిపాఠి తప్పితే వేరే ఎవరు ఆడింది లేదు. నితీష్ రానా, మోర్గాన్, రస్సెల్ అంతా కూడా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.  కెప్టెన్ దినేష్ కార్తీక్ మరోసారి విఫలమయ్యాడు. 

చెన్నై బౌలర్లలో బ్రేవో మూడు వికెట్లను తీయగా....  శార్దూల్ ఠాకూర్ , కరణ్ శర్మ, సామ్ కరన్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.