ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు హైదరాబాదీ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడుకి తుది జట్టులో స్థానం దక్కలేదు. రాయుడు 100 శాతం ఫిట్‌గా లేడని, అందుకే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసినట్టు చెప్పాడు ధోనీ.

రుతురాజ్ గైక్వాడ్ గోల్డెన్ డక్ కావడంతో 217 పరుగుల లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్ 200 పరుగులకే పరిమితమై 16 పరుగుల తేడాతో ఓడింది. నేడు అంబటి రాయుడి పుట్టినరోజు. దుబాయ్‌లో చెన్నై జట్టుతో కలిసి 35వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న అంబటి రాయుడు, మరికొన్ని మ్యాచుల్లో ఆడడం అనుమానమేనని సమాచారం.

అంబటి రాయుడికి తొడ కండరాల్లో గాయం అయ్యిందిట. ఈ గాయం మానడానికి మరికొద్ది రోజుల సమయం పడుతుండడంతో 25వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచులోనూ అంబటి రాయుడు ఆడడం లేదు. ఆ తర్వాత చెన్నై జట్టుకి వారం రోజుల విశ్రాంతి దొరకనుంది.

ఢిల్లీతో మ్యాచ్ తర్వాత అక్టోబర్ 2న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడనుంది చెన్నై. ఆ మ్యాచ్ నాటికి అంబటి రాయుడి గాయం మానిపోవచ్చని ఫిజియో అంచనా వేస్తున్నారు.