ఐపిఎల్... క్రికెట్ ప్రియులను సమ్మర్ హీట్ లోనూ మజాను అందిస్తున్న మెగా టోర్నీ. ఇప్పటికే లీగ్ దశ మ్యాచుల ద్వారా అభిమానులను అలరించిన మరికొద్ది  రోజుల్లో ప్లేఆఫ్ తో మరింత రసవత్తర పోరు జరగనుంది. అయితే ఈ క్రికెట్ మజాను ప్రత్యక్షంగా వీక్షించే అరుదైనఅవకాశాన్ని ఐపిఎల్ నిర్వహకులు  తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఐపిఎల్ టైటిల్ విజేతలను నిర్ణయించే మ్యాచులన్నీ తెలుగు నేలపైనే జరగనుండటం విశేషం. 

ఐపీఎల్‌ సీజన్ 12లో భాగంగా లీగ్ దశ ముగిసిన తర్వాత ప్లేఆఫ్ మ్యాచులు జరగనున్నాయి. అయితే ఇందులో అతి ముఖ్యమైన క్వాలిఫయర్ మ్యాచుకు విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఇలా ఐపిఎల్ మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని మిస్సైన ఏపి అభిమానులకు బంపరాఫర్ అందించారు. 

ఐపిఎల్ మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రెండో క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచుకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సి వుంది. అలాగే క్వాలిఫయర్ 1 , ఫైనల్ మ్యాచులకు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరపాలని నిర్ణయించారు. అయితే వివిధ కారణాలతో చెపాక్ స్టేడియంలో మ్యాచులు నిర్వహించడానికి ఐపిఎల్ నిర్వహకులు విముఖత చూపడంతో ఈ మ్యాచులు తెలుగు నేలపైకి మారాయి. 

మారిన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ లో జరగాల్సిన నాకౌట్ మ్యాచులను విశాఖ పట్నానికి తరలించారు. అలాగే చెన్నై లో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు. మిగిలిన ఒక్క క్వాలిఫయర్ 1 మ్యాచ్ మాత్రం చెన్నైలోనే జరగనుంది. 

మే 8వ తేదీన జరిగే ఎలిమినేటర్, మే10న జరిగే  క్వాలిఫయర్ -2 మ్యాచ్‌ లకు విశాఖ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అలాగే 12వ తేదీన జరిగే ఫైనల్ పోరుకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు సవరించిన ఐపిఎల్ షెడ్యూల్ ను నిర్వహకులు విడుదల చేశారు.