హైదరాబాద్: ఐపిఎల్ 2019లో సన్ రైజర్స్ హైదరాబాదు బోణీ కొట్టింది. ఈ సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. 

సంజు సామ్సన్‌  55 బంతుల్లో 102 పరుగులు చేసిన నాటౌట్ గా మిగిలాడు. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజన్ లో తొలి సెంచరీ సాధించిన క్రీడాకారుడిగా సామ్సన్ నిలిచాడు. అతనికి తోడుగా కెప్టెన్ అజింక్యా రహానే (49 బంతుల్లో 70; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసి గెలిచింది. వార్నర్‌ (37 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... బెయిర్‌స్టో (28 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్‌), విజయ్‌ శంకర్‌ (15 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. రషీద్‌ ఖాన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌అవార్డు లభించింది.