కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపిఎల్) 12వ ఎడిషన్ లో  భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో ఊరట లభించింది. ఆయన జట్టుకు మరో విజయం దక్కింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడిపోయింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా పవర్‌ప్లే ముగిసేలోపే మూడు వికెట్లు కోల్పోయింది. స్టెయిన్ వేసిన మొదటి ఓవర్ ఆరో బంతికి క్రిస్ లిన్(1) కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

ఆ తర్వాత నవ్‌దీప్ సైనీ వేసిన 4వ ఓవర్ ఐదో బంతికి సునీల్ నరైన్(18) భారీ షాట్‌కు ప్రయత్నించి పార్థివ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత స్టెయిన్ వేసిన 5వ ఓవర్ చివరి బంతికి గిల్(9) విరాట్‌ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

ఆ తర్వాత రాయల్స్ బౌలింగ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్లు పరుగులు చేయలేకపోయారు. మార్కస్ స్టొనిస్ వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి రాబిన్ ఊతప్ప(9) నెగీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
 
ఈ దశలో నితీశ్‌ రానా(85), అండ్రే రస్సెల్(65) చెలరేగి ఆడారు. తమ జట్టుకు విజయాన్ని అందించేందుకు వీరిద్దరు పోరాటం చేశారు. మైదానంలో బౌండరీలు బాదుతూ. జట్టును విజయతీరాలు చేర్చేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం మాత్రం బెంగళూరుకే దక్కింది. కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. దీంతో బెంగళూరు ఈ మ్యాచ్‌లో 10 పరుగులతో విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కోహ్లి 58 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. మొయిన్‌ అలీ  28 బంతుల్లో 66 పరుగులు చేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేయడం సాధ్యమైంది.