ఐపిఎల్ సీజన్ 12 లో భాగంగా హైదరాబాద్ రాజీవ్ గాందీ స్టేడియంలో బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ అభిమానులు ఎంఎస్ ధోనిని చూసే అదృష్టాన్ని కోల్పోయారు. ఇవాళ్టి మ్యాచ్ నుండి ధోనికి విశ్రాంతి ఇచ్చి సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనాకు జట్టు పగ్గాలు అప్పగించినట్లు చెన్నై మేనేజ్ మెంట్ ప్రకటించింది. 

ధోని వెన్ను నొప్పితో గతకొంత కాలంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నొప్పి అంత తీవ్రంగా లేకపోవడంతో 2019 ఐపిఎల్ సీజన్ ఆరంభం నుండి వరుసగా మ్యాచులు ఆడుతూ వస్తున్నారు. అయితే ఇప్పటికే చెన్నై జట్టు దాదాపు ప్లేఆఫ్ కు చేరుకోవడంతో ముందుజాగ్రత్తగా జట్టు మేనేజ్ మెంట్ ధోనికి విశ్రాంతినిచ్చింది. కీలక సమయాల్లో ధోని వెన్ను నొప్పి తిరగబడితే జట్టు కష్టాల్లో పడే అవకాశముంది.  

ధోని విశ్రాంతితో చెన్నై పగ్గాలు సీనియర్ ఆటగాడు రైనా చేతికి వచ్చాయి. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకున్న సూపర్ కింగ్స్  తమ వరుస విజయయాత్రను కొనసాగించాలని చూస్తోంది. అయితే ఆతిథ్య హైదరాబాద్ జట్టు కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సొంత గడ్డపై పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఇలా ఇరు జట్లు ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.  
 
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ను ఎంచుకుంది. టాస్ సందర్భంగా రైనా మాట్లాడుతూ  ధోని విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్ లో తాను చెన్నై కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు వెల్లడించాడు. తదుపరి మ్యాచ్ లో ధోని మళ్లీ జట్టులోకి  తిరిగి వస్తాడని రైనా వెల్లడించాడు.