హైదరాబాద్ వేదికగా జరగనున్న ఐపిఎల్ ఫైనల్ ఫోరుకు సర్వం సిద్దమయ్యింది. ఇప్పటికు లీగ్, క్వాలిఫయర్ దశలను దాటుకుంటు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. అయితే ఐపిఎల్ చరిత్రను ఒకసారి  పరిశీలిస్తే  ఈ రెండు జట్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా ఇప్పటికే ఈ రెండు జట్లు చెరో మూడు సీజన్లలో ఫైనల్ విజేతలుగా నిలిచి చెరో మూడు  ఐపిఎల్ ట్రోపిలను ముద్దాడాయి. ఇలా సమఉజ్జీలుగా నిలిచిన జట్ల మధ్య సీజన్ 12 ఫైనల్ మ్యాచ్  జరుగుతుండటంతో అభిమానుల్లో దీనిపై ఆసక్తి పెరిగింది. 

దీంతో ఈ మ్యాచ్ ను చూసేందుకు చెన్నై, ముంబై నగరాల నుండి అభిమానులు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. ఇక తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంత  గడ్డపై జరుగుతున్న ఫైనల్ కోసం వారు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అందువల్లే ఈ మ్యాచ్ టికెట్లకు అంతలా గిరాకీ పెరిగింది. టికెట్లు దక్కనివారు బ్లాక్ లో  భారీ ధరలను కొంటున్నారంటేనే ఈ మ్యాచుకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది.

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం  (ఉప్పల్) లో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నాయి. అయితే ఈ సీజన్ మొత్తంలో ముంబైపై ఇప్పటివరకు గెలుపున్నదే లేకుండా ప్రయాణం సాగిస్తున్న చెన్నై ఈ మ్యాచ్ ఒక్కటి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో వుంది. దీని ద్వారా ముంబై పై ప్రతీకారం తీర్చుకోవడమే కాదు టైటిల్ విజేతగా నిలవాలనుకుంటోంది.  ఇక  ముంబై  కూడా చెన్నైపై మరోసారి గెలుపుబావుటా ఎగరేసి టైటిల్ అందుకోవాలని చూస్తోంది.

ఐపిఎల్ చరిత్రను  ఓసారి పరిశీలిస్తే ఇరు జట్లు సమఉజ్జీలుగానే వున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు నాలుగుసార్లు ఫైనల్ కు చేరిన ముంబై రెండుసార్లు (2013,2015 సంవవత్సరాల్లో) ఫైనల్లో చెన్నైని ఓడించి  విజేతగా నిలిచింది. ఇలా  మరోసారి ఫైనల్ పోరులో సీఎస్కేతో తలపడుతున్న ముంబై హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసుకోవాలని చూస్తోంది. అయితే ఎనిమిదిసార్లు ఫైనల్ కు చేరి,  మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై ట్రాక్  రికార్డేం తక్కువగా లేదు. ఇలా హేమాహేమి జట్లు, దిగ్గజ సారథుల మధ్య జరుగుతున్న ఫైనల్  పోరులో ఎవరు విజేతలు నిలుస్తారో...ఎవరు ఉత్తిచేతులతో ఇంటిదారి  పడతారో మరికొద్ది గంటల్లో తేలనుంది.