హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త... ఐపీఎల్ 2019 ఫైనల్ అన్ని కుదిరితే మన భాగ్య నగరంలోనే జరగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ఐపీఎల్ ఫైనల్ ముందు సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు సొంతగడ్డపై జరగుతూ వస్తోంది.

ఈ లెక్క ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ సొంత గ్రౌండ్ చెపాక్‌లో ఈ ఏడాది ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ ఫైనల్ వేదికను ఉప్పల్ స్టేడియానికి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళనాడు క్రికెట్ సంఘం నిర్మించిన చెపాక్ స్టేడియంలో మూడు స్టాండ్స్ విషయంలో వివాదం నెలకొని ఉంది. 2012లో నిర్మించిన ఈ స్టాండ్స్‌కు చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ అనుమతి నిరాకరించింది.

దీంతో 12 వేల సామర్థ్యం ఉన్న ఈ స్టాండ్స్ నాటి నుంచి ఖాళీగా ఉంటుంన్నాయి. దీంతో మ్యాచ్ జరిగిన ప్రతీసారి ఈ స్టాండ్స్ ఖాళీగానే కనిపిస్తున్నాయి. మున్సిపల్ కార్పోరేషన్, తమిళనాడు క్రికెట్ సంఘం మధ్య వివాదం పరిష్కారం కాకపోవడం.. ఈ సమస్యను వారం రోజుల్లో పరిష్కరించుకోవాలని ఐపీఎల్ నిర్వాహకులు చెన్నైకు సూచించారు.

లేని పక్షంలో ఫైనల్‌ను హైదరాబాద్‌కు.. ప్లేఆఫ్‌ మ్యాచ్‌లను బెంగళూరుకు తరలించాలని బీసీసీఐ పాలకుల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు క్రికెట్ సంఘాన్ని హెచ్చరించింది. మరోవైపు ఐపీఎల్ సందర్భంగా నాలుగు మహిళా మ్యాచ్‌లు నిర్వహించాలని సోమవారం బీసీసీఐ సమావేశంలో బోర్డు నిర్ణయించింది.