ఐపిఎల్ సీజన్ 12 లో మిగతా జట్లన్ని ప్లేఆఫ్ కోసం తలపడుతుంటే చెన్నై సూపర్ కింగ్స్, డిల్లీ క్యాపిటల్స్ మాత్రం టాప్ ప్లేస్ కోసం తలపడ్డాయి. బుధవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య చెన్నై జట్టుదే డిల్లీపై పైచేయిగా నిలిచింది. 180 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన డిల్లీ 99 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ ఐపిఎల్ లో రెండోసారి సీఎస్కే చేతిలో ఘోరంగా ఓడిపోయిన డిల్లీ పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానానికే పరిమితమయ్యింది. 

ఇక డిల్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(44), ఓపెనర్ ధావన్(19) ఇద్దరే రెండంకెల స్కోరును సాధించారు. మిగతా డిల్లీ జట్టంతా కనీసం పదిపరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో డిల్లీ 99 పరుగులకే ఆలౌటయ్యింది. డిల్లీని కుప్పకూల్చడంతో చెన్నై స్పిన్నర్లు ఇమ్రాన్ తాహిర్(4వికెట్లు), జడేజా(3 వికెట్లు)లు ప్రధాన పాత్ర పోషించారు. వారితో పాటు చాహర్, హర్బజన్ చెరో వికెట్ పడగొట్టారు. 

సొంతమైదానంలో మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అదరగొట్టింది. చెన్నై బ్యాటింగ్ ను నెమ్మదిగా ఆరంభించి చివర్లో స్పీడ్ పెంచింది. రైనా హాఫ్ సెంచరీ, డుప్లెసిస్ 39 పరుగులతో మెరిసారు. ఇక డెత్ ఓవర్లలో ధోని మరోసారి చెలరేగి 22 బంతుల్లోనే 44 పరుగులు చేసి చెన్నైకి 179 పరుగుల భారీ స్కోరు అందించాడు. దీంతో డిల్లీ ముందు 180 పరుగుల భారీలక్ష్యాన్ని వుంచగలిగింది. 

మొదట నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేసినమ రైనా ఆ తర్వాత వేగంగా పరుగులు సాధించడానికి ప్రయత్నించి ఔటయ్యాడు. 37 బంతుల్లో 1 సిక్సు, 8 ఫోర్ల సాయంతో 59 పరుగులు చేసి ఆకట్టుకున్న అతడు చివరకు సుచిత్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అంతకు ముందు నిలకడగా ఆడుతూ 41 బంతుల్లో 39 పరుగులు చేసి ఓపెనర్ డుప్లెసిస్ ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో శిఖర్ ధావన్ కు క్యాచ్ ఇచ్చి డుప్లెసిస్ పెవిలియన్ బాట పట్టాడు. 

చెపాక్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై కి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్  షేన్ వాట్సన్ డిల్లీ బౌలర్ సుచిత్ బౌలింగ్ డకౌటయ్యాడు. 9 బంతులను ఎదుర్కొన్న వాట్సన్ ఒక్క పరుగును సాధించలేకపోయాడు. 

ఐపిఎల్ సీజన్ 12 లో మరో ఆసక్తికరమైన  పోరుకు చెన్నైలోని చెపాక్ స్టేడియం సిద్దమయ్యింది. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక విజయాలు అందుకుని పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన రెండు జట్ల మధ్య రసవత్తర మ్యాచ్ జరిగింది. మొదటినుండి టాప్ లో నిలిచిన తమను వెనక్కినెట్టిన డిల్లీ క్యాపిటల్స్ పై ఈ మ్యాచ్ ద్వారా ప్రతికారం తీర్చుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావించగా... ఇప్పటికే ఓసారి చెన్నై చేతిలో ఓటమిపాలైన డిల్లీ ఈ మ్యాచ్ లో ఎట్టిపరిస్ధితుల్లో గెలిచి పైచేయి సాధించాలని చూసింది. అయితే ధోని సేన ముందు డిల్లీ ఆటలు సాగలేవు.

 టాస్ గెలిచిన దిల్లీ  ధోనీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆ జట్టు సారథి  శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.... ఈ పిచ్ పై చేజింగ్ ఈజీగా వుంటుందనే ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు. దీంతో మరోసారి సొంత మైదానంలో చెన్నై జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది. పిచ్‌పై పగుళ్లు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు శ్రేయాస్‌ వెల్లడించాడు.
 
ఈ మ్యాచ్ కు ముందే చెన్నై అభిమానుల్లో జోష్ కనిపించింది. ఎందుకంటే గత మ్యాచ్ లో జ్వరంతో బాధ పడుతూ జట్టుకు దూరమైన కెప్టెన్ ధోనితో పాటు ఓపెనర్ డుప్లెసిస్‌, రవీంద్ర జడేజాలు తిరిగి జట్టులోకి వచ్చారు.  

ఇప్పటికే ప్లేఆప్ కు చేరడంతో డిల్లీ కూడా కొందరు కీలక ప్లేయర్లు విశ్రాంతినిచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పడగొట్టి మంచి ఊపుమీదున్న రబాడతో పాటు ఇషాంత్ శర్మకు విశ్రాంతినిచ్చి ట్రెంట్ బౌల్ట్, సుచిత్ లను జట్టులోకి తీసుకున్నారు. 

డిల్లీ జట్టు:

శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శిఖర్ ధావన్, పృథ్వి షా, కొలిన్ ఇంగ్రామ్, రిషబ్ పంత్, రూథర్ పర్డ్, అక్షర్ పటేల్, మొర్రిస్, అమిత్ మిశ్రా, సుచిత్, బౌల్ట్

 చెన్నై జట్టు:

డుప్లెసిస్, ఎంఎస్ ధోని, షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేష్ రైనా, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహల్,  హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్