ఐపిఎల్  సీజన 12లో ఇప్పటికే వరుస పరాజయాలతో పాయింట్స్ టేబుల్ చివరన నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు స్టార్ బ్యాట్ మెన్ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమవగా ఇప్పుడె మరో నలుగురు ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా జట్టుకు దూరం కానున్నారు.వన్డే క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు ఐపిఎల్ నుండి ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఇలా ఈ నెల 25 లోపు ఐదుగురు విదేశీ ఆటగాళ్లు రాజస్ధాన్ జట్టుకు దూరమవనున్నారు.  

మే31 నుండి స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ ను ఇంగ్లాండ్ జట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  తమకు కలగా మిగిలిపోయిన వరల్డ్ కప్ ట్రోపిని ఈసారి ఎలాగైనా ముద్దాడాలని చూస్తోంది. దీంతో ఈ మెగా టోర్నీకి నెల రోజుల ముందే ఇంగ్లాండ్ జట్టు ప్రత్యేక సాధన చేపట్టనుంది. దీంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ బోర్డు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న ఆటగాళ్లను స్వదేశానికి రావాల్సిందిగా ఆదేశించింది. ఈ నిర్ణయం రాజస్థాన్ జట్టును తీవ్రంగా దెబ్బతీయనుంది. 

ఇక ఆస్ట్రేలియా బోర్డు కూడా తమ జట్టును ముందునుంచే ప్రపంచ కప్ కు సన్నద్దం చేసేందుకు సిద్దమైంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు కూడా ఐపిఎల్ కు దూరం కానున్నారు. ఇలా రాజస్థాన్ జట్టులో ఇప్పుడున్న ఎనిమిది మంది ఓవర్సీస్ ఆటగాళ్లలో ఐదురుగు లీగ్ దశకు ముందే స్వదేశాలకు వెళ్లిపోనున్నారు. ఈ నిర్ణయం రాజస్థాన్ జట్టును తీవ్రంగా దెబ్బతీయనుంది. 

ఇప్పటికే ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ జట్టుకు దూరమవగా బెన్ స్టోక్స్, ఆర్చర్, టర్నర్ లు కూడా మరో రెండు రోజుల్లో ఇంగ్లాండ్ కు పయనమవనున్నారు. ఇక ప్రస్తుతం రాజస్థాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కూడా జట్టుకు దూరమవనున్నాడు. ఇప్పటికే లీగ్ దశలోనే దడబడుతున్న రాజస్ధాన్ ప్లేఆఫ్ కు చేరుకునే అవకాశాలు తక్కువగా వున్నాయి. ఒకవేళ ప్లేఆఫ్ కు చేరుకుంటే ఈ ఆటగాళ్లు లేని ప్రభావం ఆ జట్టుపై పడనుంది.