గత రెండు నెలలుగా సాగుతున్న టీమిండియా కోచ్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బిసిసిఐ ఆహ్వానం మేరకు కేవలం ఒక్క చీఫ్ కోచ్ పదవికే దాదాపు 2వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందులో కేవలం ఆరుగురు మాత్రమే చివరిపోటీలో నిలిచారు. ఈ చీఫ్ కోచ్ నియామక ప్రక్రియను చేపడుతున్న కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ ఇవాళ(శుక్రవారం) తుది అభ్యర్థిని నిర్ణయించనున్నారు. అంటే టీమిండియా చీఫ్ కోచ్ గా ఎవరన్నదానిపై గత రెండు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడనుంది. 

టీమిండియా చీఫ్ కోచ్ పదవికోసం అందిన దరఖాస్తులను సీఏసి పరిశీలించి అందులోంచి ఓ ఆరుగురిని షార్ట్ లిస్ట్ చేసింది. వీరిలో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, మైక్ హెసెన్, ఫిల్ సిమన్స్, రాబిన్ సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ లు వున్నారు. వీరిని ఇవాళ పర్సనల్ గా ఇంటర్వ్యూ చేయనున్న సీఏసి తుది అభ్యర్థిని ఎంపిక చేయనుంది. అయితే ఏ విధంగా చూసినా ప్రస్తుత కోచ్ రవిశాస్త్రే మళ్లీ కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  

విదేశీయులను కోచ్ గా నియమించడానికి బిసిసిఐ సుముఖంగా లేదట. ఈ విషయంపై ఇప్పటికే సీఏసీ కి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిందని సమాచారం. దీంతో టామ్ మూడీ, మైక్ హెస్సన్, ఫిల్ సిమన్స్ లు చీఫ్ కోచ్ గా ఎంపికయ్యే అవకాశం లేదు. ఇక మిగిలింది రవిశాస్త్రి, లాల్ చంద్ రాజ్ పుత్, రాబిన్ సింగ్ లు మాత్రమే.  

స్వదేశానికి చెందిన వారిలో రాజ్ పుత్, రాబిన్ సింగ్ లు చాలా తక్కువ కాలం క్రికెటర్లుగా కొనసాగారు. అంతేకాకుండా కోచ్ లుగా వారికున్న అనుభవం చాలా  తక్కువ. కానీ రవిశాస్త్రి సుదీర్ఘకాలం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ  తర్వాత వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా క్రికెట్ లో వస్తున్న మార్పులను చాలా దగ్గరనుండి గమనించింది. ఇక అతడు చీఫ్ కోచ్ ఎంపికైన తర్వాత టీమిండియా  70శాతం విజయాలతో దూసుకుపోతోంది. అంతేకాకుండా అతడికి బిసిసిఐ ఉన్నతాధికారులతో పాటు కెప్టెన్ కోహ్లీ, ఆటగాళ్లతో మంచి సంబంధాలున్నాయి. కాబట్టి మిగతా ఇద్దరితో పోలిస్తే రవిశాస్త్రికే మళ్లీ టీమిండియా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. 

ప్రస్తుతం భారత  జట్టుతో పాటు వెస్టిండిస్ పర్యటనలో వున్న రవిశాస్త్రి స్కైప్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొంటాడని సమాచారం.  రాబిస్ సింగ్,  రాజ్ పుత్, హెస్సన్ లు నేరుగా కపిల్ దేవ్ కమిటీ ముందు హాజరుకానున్నారు. అయితే టామ్ మూడీ, సీమన్స్ ల ఇంటర్వ్యూ ఎలా జరగనుందో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ప్రధాన కోచ్‌ను మినహాయించి మిగిలిన పోస్టులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.