అఫ్గానిస్థాన్‌‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం జరిపిన ఆత్మాహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్‌ అంపైర్‌ మరణించారు. ఆయన పేరు బిస్మిల్లా జాన్‌ షిన్వారి. షిన్వారి పలు అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నంగర్‌హార్‌ ప్రావిన్స్‌లోని ఘనిఖిల్‌ జిల్లా గవర్నర్‌ ఇంటివద్ద శనివారం మధ్యాహ్నం దుండగులు కారు బాంబు ద్వారా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా మరో 30 మంది గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిలో అంపైర్‌ షిన్వారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నంగర్‌హార్ గవర్నర్ కార్యాలయ ప్రతినిధి ఈ ఘటనను ధ్రువీకరించారు. ఆయుధాలు ధరించి కొందరు దుండుగులు జిల్లా గవర్నర్‌ కాంపౌండ్‌లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా వారిని సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపారని వెల్లడించారు.