ప్రపంచకప్ ఫైనల్ ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా దాని గురించే మాట్లాడుకోవడం బహుశా ఈ ఏడాది వరల్డ్‌కప్‌కే చెల్లుతుందనుకుంటా.. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ ఫైనల్ ఓవర్‌లో గప్టిల్ ఓవర్‌త్రో పై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.

అంపైర్లు సరిగా నిబంధనలు పాటించలేదని.. అందువల్లే న్యూజిలాండ్ ఓడిపోయిందని ఇలా ఎవరికీ తోచినట్లు వారు కామెంట్లు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పందించింది.

అంపైర్ల నిర్ణయంపై విమర్శలు చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. నిబంధనలపై వారికున్న అవగాహన మేరకు మైదానంలో అంపైర్లు నిర్ణయం తీసుకుంటారని.. విధానపరమైన ఇటువంటి నిర్ణయాలపై వ్యాఖ్యలు చేయడం సరైన పద్దతి కాదంటూ ఐసీసీ వ్యాఖ్యానించింది.

కాగా.. బెన్‌స్టోక్స్ ఆడిన బంతి బౌండరీ లైన్ వద్దకు చేరుకోగా.. అక్కడ  ఫీల్డింగ్ చేస్తున్న గప్టిల్ బంతిని వికెట్ల మీదకు వేయగా.. అది పరుగు కోసం ప్రయత్నిస్తున్న బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది.

దీంతో ఓవర్‌త్రోతో కలిపి మొత్తం ఆరు పరుగులను అంపైర్లు ఇంగ్లాండ్‌కు ఇచ్చారు. దీని వల్లే న్యూజిలాండ్‌కు కప్ దూరమైందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.