Australia Vs Pakistan: రెండున్నర దశాబ్దాల  తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. టెస్టు సిరీస్ ముగిశాక ఈనెల 29 నుంచి పాక్ తో  3 వన్డేలు కూడా ఆడనుంది. అయితే వన్డే సిరీస్ నేపథ్యంలో.... 

పాకిస్థాన్ తో వన్డే సిరీస్ కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆసీస్ జట్టు కీలక ఆటగాడు, బౌలర్ కేన్ రిచర్డ్సన్ మోకాలి గాయంతో వైదొలిగాడు. పాక్ తో వన్డే సిరీస్ నేపథ్యంలో ప్రాక్టీస్ సందర్భంగా అతడు గాయపడ్డట్టు తెలుస్తున్నది. పాకిస్థాన్ తో మూడో టెస్టు ముగిసిన వెంటనే ఆ జట్టు వన్డేలలో కూడా తలపడనున్నది. ఈ క్రమంలో వన్డే సిరీస్ సన్నాహాకాల్లో భాగంగా మెల్బోర్న్ లో ఆరోన్ పించ్ సారథ్యంలోని జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా రిచర్డ్సన్ కు గాయమైనట్టు సమాచారం. రిచర్డ్సన్ స్థానంలో బెన్ ద్వార్షుయిస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. 

రిచర్డ్సన్ స్థానంలో వచ్చిన బెన్ ద్వార్షుయిస్‌ కు అంతర్జాతీయ క్రికెట్ లో పెద్దగా అనుభవం లేదు. 2017లో ఆస్ట్రేలియా టీ20 జట్టులో సభ్యుడిగా ఉన్నా తర్వాత అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే బిగ్ బాష్ లీగ్ లో మాత్రం ఈ యువ పేసర్ అదరగొడుతున్నాడు. 

బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతున్న బెన్.. రిచర్డ్సన్ స్థానాన్ని భర్తీ చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. వన్డే సిరీస్ లో బెన్.. జోష్ హెజిల్వుడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ లతో కలిసి బౌలింగ్ చేయనున్నాడు. 

Scroll to load tweet…

1998 తర్వాత తొలిసారి పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఆసీస్.. ఆ జట్టుతో ప్రస్తుతం మూడు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడుతున్నది. రావల్పిండి, కరాచీలో ముగిసిన రెండు టెస్టులు పేలవమైన డ్రా గా ముగిశాయి. ఇక మూడో టెస్టు ప్రస్తుతం.. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరుగుతున్నది. ఈ టెస్టు ముగిశాక (మార్చి 25న) ఆసీస్.. పాక్ తో మూడు వన్డేలు ఆడుతుంది. 

వన్డే సిరీస్ షెడ్యూల్ : 

- మార్చి 29న తొలి వన్డే : లాహోర్
- మార్చి 31న రెండో వన్డే : లాహోర్
- ఏప్రిల్ 3న మూడో వన్డే : లాహోర్ 
- ఏప్రిల్ 5న ఏకైక టీ 20 : లాహోర్ 

ఇక ప్రస్తుతం లాహోర్ లో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో రెండో రోజు మూడో సెషన్ ముగిసేటప్పటికీ తొలి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన 
ఆసీస్ 391 పరుగులకు ఆలౌట్ అయింది. ఉస్మాన్ ఖవాజా (91) తృటిలో సెంచరీ కోల్పోగా.. కామెరాన్ గ్రీన్ (79), అలెక్స్ కేరీ (67), స్టీవ్ స్మిత్ (59) లు రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది తో పాటు నజీమ్ షా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాక్.. ఐదు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది.