ICC Womens T20 World Cup: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో టీమిండియా యువ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ విజృంభించింది. ఇంగ్లాండ్ పై ఐదు వికెట్లతో చెలరేగింది.
మహిళల ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ - ఇండియా మధ్య జరుగుతున్న గ్రూప్ - బీ లీగ్ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. టీమిండియా యువ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నిప్పులు చెరిగింది. ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో నటాలి సీవర్ (42 బంతుల్లో 50, 5 ఫోర్లు), అమీ జోన్స్ (27 బంతుల్లో 40, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. రేణుకా ధాటికి ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. మరి ఈ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు ఎలా ఛేదిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ కు టీమిండియా పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ వరుస షాకులిచ్చింది. రేణుకా వేసిన తొలి ఓవర్ మూడో బంతికే వ్యాట్ (0) వికెట్ కీపర్ రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రేణుకా.. క్యాప్సీ (3) ని క్లీన్ బౌల్డ్ చేసింది.
అదే ఊపులో రేణుకా.. మరో ఓపెనర్ సోఫి డంక్లీ (10) ని క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. ఐదు ఓవర్లలో ఇంగ్లాండ్ 29 పరుగులకే ముగ్గురు కీలక బ్యాటర్లు నిష్క్రమించడంతో ఇబ్బందుల్లో పడింది.
ఆదుకున్న సీవర్ - నైట్
వెంటవెంటనే కీలక వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ ను ఆల్ రౌండర్ నటాలీ సీవర్, కెప్టెన్ హీథర్ నైట్ (23 బంతుల్లో 28, 4 ఫోర్లు) ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 51 పరుగులు జోడించారు. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన 9వ ఓవర్మో నైట్ రెండు ఫోర్లు కొట్టింది. షఫాలీ వేసిన పదో ఓవర్లో నటాలీ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు బాదింది. పది ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు 72-3గా ఉంది.
జోరుమీదున్న నైట్, సీవర్ ల జోడీని శిఖా పాండే విడదీసింది. ఆమె వేసిన 11వ ఓవర్లో నైట్.. మూడో బంతిని బౌండరీకి తరలించింది. కానీ అదే ఓవర్లో చివరి బంతికి ఆమె షఫాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటైంది. ఆమె స్థానంలో వచ్చిన అమీ జోన్స్ కూడ ధాటిగానే ఆడటంతో ఇంగ్లాండ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీప్తి శర్మ వేసిన 17వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సీవర్.. అదే ఓవర్లో ఐదో బంతికి స్మృతి మంధానకు క్యాచ్ ఇచ్చింది.
సీవర్ ఔట్ అయినా జోన్స్ ధాటిగా ఆడింది. దీప్తి వేసిన 19వ ఓవర్లో జోన్స్, ఎక్లెస్టోన్ లు తలా ఓ సిక్సర్ బాదారు. రేణుకా చివరి ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి ఏడు పరుగులే ఇవ్వడంతో ఇంగ్లాండ్ 151 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో రేణుకా.. 4 ఓవర్లు వేసి 15 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. టీ20తో పాటు అన్ని ఫార్మాట్లలో ఆమెకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. దీప్తి, శిఖా లకు తలా ఓ వికెట్ దక్కింది.
