Asianet News TeluguAsianet News Telugu

INDvsWI 4th T20I: నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం... టీ20 సిరీస్ కూడా మనదే...

బౌలింగ్‌లోనూ అదరగొట్టిన భారత బౌలర్లు... నాలుగో టీ20లో 132 పరుగులకి విండీస్ ఆలౌట్... 59 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం..

INDvsWI 4th T20I: Team India beats West Indies in 4th T20I and wins t20 series
Author
India, First Published Aug 7, 2022, 12:27 AM IST

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు మరో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే, టీ20 సిరీస్ నెగ్గి వెస్టిండీస్‌లో అడుగుపెట్టిన భారత జట్టు... విండీస్‌పై కూడా సేమ్ సీన్ రిపీట్ చేసింది. వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, నాలుగో టీ20లో ఘన విజయం అందుకుని 3-1 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది...

192 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బ్యాటింగ్‌కి వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 132 పరుగులకే పరిమితమైంది. మొదటి ఓవర్‌లో దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన బ్రెండన్ కింగ్ 8 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేశాడు. బ్రెండన్ కింగ్‌ని అవుట్ చేసిన ఆవేశ్ ఖాన్, ఆ తర్వాత డేవిడ్ థామస్ కూడా పెవిలియన్ చేర్చాడు...

నికోలస్ పూరన్ 8 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 24 పరుగులు చేసి రనౌట్ కాగా కేల్ మేయర్స్ 16 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 16 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన రోవ్‌మెన్ పావెల్‌ కూడా అక్షర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరగా సిమ్రాన్ హెట్మయర్ 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి రవిభిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

జాసన్ హోల్డర్ 9 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ కాగా 5 పరుగులు చేసిన డొమినిక్ డ్రాక్స్ కూడా అతని బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు చేసింది...

రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి తొలి వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం అందించారు. వస్తూనే బాదుడు మొదలెట్టడంతో 4.3 ఓవర్లలోనే భారత స్కోరు బోర్డు హాఫ్ సెంచరీ మార్కును దాటేసింది. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో 16 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు...

సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, ఎమ్మెస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఫీట్ సాధించిన ఏడో భారత క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ. అలాగే ఓపెనర్‌గా టీ20ల్లో 3 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గానూ నిలిచాడు రోహిత్ శర్మ. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్, రోహిత్ కంటే ముందు ఈ ఫీట్ సాధించాడు... 

అలాగే ఈ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లతో అంతర్జాతీయ కెరీర్‌లో 477 సిక్సర్లను పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, క్రిస్ గేల్ తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. 476 అంతర్జాతీయ సిక్సర్లు బాదిన పాక్ మాజీ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీని దాటేసిన రోహిత్ శర్మ, 477 సిక్సర్లతో 553 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

రోహత్ శర్మను అకీల్ హుస్సేన్ క్లీన్ బౌల్డ్ చేయగా 14 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్...

వన్‌డౌన్‌లో వచ్చిన దీపక్ హుడా 19 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి అవుట్ కాగా రిషబ్ పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసి మెప్పించాడు. దినేశ్ కార్తీక్ 9 బంతుల్లో 6 పరుగులు చేసి ఓబెడ్ మెక్‌కాయ్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా సంజూ శాంసన్ 23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

ఆఖర్లో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ 8 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి మెరుపులు మెరిపించి భారత స్కోరు కార్డుని 190 దాటించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios