Asianet News TeluguAsianet News Telugu

INDvsWI 3rd T20I: సూర్య భాయ్ సూపర్ షో... మూడో టీ20లో టీమిండియా ఘన విజయం...

India vs West Indies: 76 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్... 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం... సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యం... 

INDvsWI 3rd T20I: SuryaKumar Yadav half century, Team India beats West Indies in 3rd T20I
Author
India, First Published Aug 3, 2022, 2:34 AM IST

రెండో టీ20లో ఆలౌట్ అయ్యి, చిత్తుగా ఓడిన భారత జట్టు... మూడో టీ20లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చేసింది. వెస్టిండీస్ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత జట్టు. రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరినా ఓపెనర్‌గా వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ హాఫ్ సెంచరీతో పని పూర్తి చేశాడు.

బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ అర్ధాంతరంగా క్రీజు వీడి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు.. 5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అల్జెరీ జోసఫ్ వేసిన రెండో ఓవర్‌లో తొలి బంతికి అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఆ తర్వాత మూడో బంతికి చూడచక్కని ఫోర్ వచ్చింది..

అయితే ఈ షాట్ ఆడే సమయంలో ఇబ్బందికి గురి కావడంతో ఆ తర్వాతి బంతి తర్వాత ఫిజియోని పిలిపించి కాసేపు మాట్లాడిన రోహిత్, నడవడానికి కష్టపడుతూ పెవిలియన్ చేరడం కనిపించింది...

అయితే శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 90 పరుగులు జోడించారు. 27 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

అయ్యర్ అవుటయ్యే సమయానికి 11 ఓవర్లలో 105 పరుగులు చేసింది భారత జట్టు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, డొమినిక్ డ్రాక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా 4 పరుగులు చేసి నిరాశపరిచినా రిషబ్ పంత్ 26 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు, దీపక్ హుడా 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు... 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య వెస్టిండీస్ జట్టు... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల ఓ మాదిరి స్కోరు చేయగలిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన దీపక్ హుడా కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. అయితే భువీ వేసిన రెండో ఓవర్‌లో 6 పరుగులు రాబట్టిన విండీస్ ఓపెనర్లు, ఆవేశ్ ఖాన్‌ని మరోసారి టార్గెట్ చేస్తూ మూడో ఓవర్‌లో 15 పరుగులు రాబట్టారు...

ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓక్క ఫోర్ ఇచ్చాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది వెస్టిండీస్. 20 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్‌ని హార్ధిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్‌తో టీ20ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు హార్ధిక్ పాండ్యా...

టీ20ల్లో 800లకు పైగా పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, 50 వికెట్లు తీసి.. భారత జట్టు తరుపున 500+ పరుగులు, 50+ వికెట్లు తీసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. భారత జట్టు తరుపున టీ20ల్లో 50+ వికెట్లు తీసిన ఆరో బౌలర్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా...

ఇంతకుముందు యజ్వేంద్ర చాహాల్ 79 వికెట్లతో టాప్‌లో ఉంటే భువనేశ్వర్ కుమార్ 73, జస్ప్రిత్ బుమ్రా 69, రవిచంద్రన్ అశ్విన్ 64, రవీంద్ర జడేజా 50 వికెట్లతో హార్ధిక్ పాండ్యా కంటే ముందున్నారు. 

అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్ ఇచ్చిన క్యాచ్‌ని రోహిత్ శర్మ జారవిడిచాడు... అయితే తనకి దక్కిన లైఫ్‌ని సరిగ్గా వినియోగించుకోలేకపోయిన విండీస్ కెప్టెన్ 23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసిన కేల్ మేయర్స్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లోనే రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన సిమ్రాన్ హెట్మయర్ 17 పరుగులు రాబట్టాడు. గత మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 10 పరుగులను కట్టడి చేయలేక విమర్శలు ఎదుర్కొన్న ఆవేశ్ ఖాన్, నేటి మ్యాచ్‌లో 3 ఓవర్లో 47 పరుగులు సమర్పించి చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు...

20వ ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో రెండు వరుస ఫోర్లు బాదిన రోవ్‌మెన్ పావెల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  ఆ తర్వాత రెండో బంతికి 12 బంతుల్లో 2 సిక్సర్లతో 20 పరుగులు చేసిన సిమ్రాన్ హెట్మయర్ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు...

Follow Us:
Download App:
  • android
  • ios