సారాంశం

తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసిన టీమిండియా... 87 పరుగులతో క్రీజులో విరాట్ కోహ్లీ.. 

డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత లెక్కలు సరిచేసుకునేందుకు వెస్టిండీస్ గడ్డ మీద అడుగుపెట్టిన భారత క్రికెటర్లు, ఆ పనిలో దాదాపు సక్సెస్ సాధించేశారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు కూడా టీమిండియా ఆధిపత్యం కనిపించింది..  రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది భారత జట్టు.. 

మొదటి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా 121 పరుగులు చేసిన టీమిండియా, రెండో సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయింది. మూడో సెషన్‌లో రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి వెస్టిండీస్‌కి మరో వికెట్ దక్కకుండా ఆటను ముగించారు. దీంతో ఓవరాల్‌గా మొదటి రోజు ఆటలో భారత జట్టు ఆధిక్యం కొనసాగింది.

161 బంతుల్లో 8 ఫోర్లతో 87 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువలో ఉంటే, రవీంద్ర జడేజా 84 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 106 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 


అంతకుముందు తొలి సెషన్‌లో పూర్తిగా టీమిండియా డామినేషన్ కొనసాగింది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

లంచ్ బ్రేక్‌కి ముందు స్లిప్‌లో క్యాచ్ డ్రాప్ కావడంతో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న యశస్వి జైస్వాల్, ఆ అవకాశాన్ని పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. 74 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లోనే కిర్క్ మెక్‌కెంజీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

మొదటి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 228త పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (288 పరుగులు), సౌరవ్ గంగూలీ (267) తర్వాతి స్థానంలో నిలిచాడు.

వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన శుబ్‌మన్ గిల్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి కీమర్ రోచ్ బౌలింగ్‌లో జోషువా డి సిల్వకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 143 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేసిన రోహిత్ శర్మ, వర్రీకాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
 
2019లో టెస్టు ఓపెనర్‌గా మారిన రోహిత్ శర్మ, ఓపెనర్‌గా టెస్టుల్లో 2 వేల పరుగులతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. మార్నస్ లబుషేన్, బాబర్ ఆజమ్, స్టీవ్ స్మిత్, జో రూట్, ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, ట్రావిస్ హెడ్ మాత్రమే ఇంతకుముందు ఈ ఫీట్ సాధించారు.

80-99 స్కోర్ల మధ్య అవుట్ కావడం రోహిత్ శర్మకి ఇది 15వ సారి. సచిన్ టెండూల్కర్ 51 సార్లు ఈ స్కోర్ల మధ్య అవుట్ కాగా విరాట్ కోహ్లీ 22 సార్లు ఈ స్కోర్ల మధ్య పెవిలియన్ చేరాడు. 

ఒకానొక దశలో 139/0  స్కోరుతో ఉన్న భారత జట్టు, 16 పరుగుల తేడాలో 3 వికెట్లు కోల్పోయి 155/3కి చేరుకుంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, మొదటి పరుగు చేసేందుకు 20 బంతులు తీసుకున్నాడు.  విరాట్ కోహ్లీతో కలిసి 12 ఓవర్లలో 27 పరుగుల భాగస్వామ్యం జోడించిన అజింకా రహానే, 36 బంతుల్లో 8 పరుగులు చేసి షాన్నన్ గ్యాబ్రియల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  రహానే వికెట్ పడగానే టీ బ్రేక్ తీసుకున్నారు..