India vs West Indies 1st T20I: నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీ... 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసిన వెస్టిండీస్...

టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన విండీస్‌కి మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది... 4 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్‌ని భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది వెస్టిండీస్. కేల్ మేయర్స్ 24 బంతుల్లో 7 ఫోర్లతో 31 పరుగులు చేశాడు.

రోస్టన్ ఛేజ్ 10 బంతుల్లో 4 పరుగులు చేసిన ఆరంగ్రేట బౌలర్ రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రోవ్‌మన్ పావెల్ 2 పరుగులు చేసి రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 12 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసిన అకీల్ హుస్సేన్‌, దీపక్ చాహార్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

14 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు మాత్రమే చేయగలిగింది వెస్టిండీస్. యజ్వేంద్ర చాహాల్ వేసిన 15వ ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే రాగా, 16వ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత చాహాల్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఏకంగా 17 పరుగులు రాబట్టారు పూరన్, పోలార్డ్...

Scroll to load tweet…

హర్షల్ పటేల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన నికోలస్ పూరన్, ఆఖరి బంతికి విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 19వ ఓవర్‌లో సిక్సర్ బాదిన విండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్ 12 పరుగులు రాబట్టాడు...

4 బంతుల్లో 4 పరుగులు చేసిన ఓడియన్ స్మిత్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. విండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్ 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు... 

ఆరంగ్రేట మ్యాచ్ ఆడుతున్న యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్ 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి సీనియర్ల కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. రవి భిష్ణోయ్ మినహా మిగిలిన భారత బౌలర్లు అందరూ 7కి రన్‌ రేట్‌తో పరుగులు సమర్పించారు. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఒక్క ఓవర్ బౌలింగ్ చేసి 4 పరుగులు మాత్రమే ఇచ్చినా, మళ్లీ అతనికి మరో ఓవర్ వేసే అవకాశం దక్కలేదు కెప్టెన్ రోహిత్ శర్మ... 

ఆఖరి 5 ఓవర్లలో 65 పరుగులు చేసింది వెస్టిండీస్ జట్టు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి భిష్ణోయ్ రెండేసి వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, యజ్వేంద్ర చాహాల్‌లకి తలా ఓ వికెట్ దక్కింది. 

ఐపీఎల్ 2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.7.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్, 7 వికెట్లు పడిన తర్వాత కూడా క్రీజులోకి రాకపోవడం విశేషం...