India vs West Indies: 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్... చాహాల్‌కి మూడు వికెట్లు, రెండు వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్...
వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత బౌలర్లు శుభారంభం చేశారు. టీమిండియా కెరీర్‌లో 1000వ వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన నయా సారథి రోహిత్ శర్మ, ప్రత్యర్థి జట్టుకి బ్యాటింగ్ అప్పగించాడు. తొలి ఓవర్ నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు భారత బౌలర్లు... కనీసం ఈ మ్యాచ్‌లో అయినా విరాట్, రోహిత్‌ల బ్యాటు నుంచి సెంచరీ చూద్దామంటే... విండీస్ జట్టు ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన కొద్దిసేపటికే 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది పర్యాటన జట్టు...
దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇచ్చిన మహ్మద్ సిరాజ్, విండీస్ ఓపెనర్ షై హోప్‌ను అవుట్ చేసి వన్డే కెరీర్‌లో తొలి వికెట్ సాధించాడు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆరంగ్రేటం చేశాడు మహ్మద్ సిరాజ్. అయితే ఆ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన మహ్మద్ సిరాజ్, 76 పరుగులు సమర్పించాడు....
ఆరంగ్రేటం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్‌గా చెత్త రికార్డు క్రియేట్ చేసిన సిరాజ్, రెండేళ్ల తర్వాత వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చాడు. 10 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన షై హోప్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 26 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
34 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన డారెన్ బ్రావో, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 25 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన నికోలస్ పూరన్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన యజ్వేంద్ర చాహాల్, వన్డే కెరీర్‌లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు...
60 వన్డేల్లో ఈ ఫీట్ సాధించిన యజ్వేంద్ర చాహాల్, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంతకుముందు మహ్మద్ షమీ (56), జస్ప్రిత్ బుమ్రా (57), కుల్దీప్ యాదవ్ (58), ఇర్ఫాన్ పఠాన్ (59) మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించి, యజ్వేంద్ర చాహాల్ కంటే ముందున్నారు...
పూరన్ అవుటైన తర్వాతి బంతికే విండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్. చాహాల్ బౌలింగ్‌లో పోలార్డ్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు... 26 బంతుల్లో 12 పరుగులు చేసిన షమర్ బ్రూక్స్ కూడా చాహాల్ బౌలింగ్‌లోనే రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
3 బంతులాడి పరుగులేమీ చేయలేకపోయిన అకీల్ హుస్సేన్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది వెస్టిండీస్. మొదటి ఆరు వికెట్లలో మూడు సార్లు డీఆర్‌ఎస్ కూడా భారత జట్టుకి అనుకూలంగా రావడం మరో విశేషం.
