Asianet News TeluguAsianet News Telugu

టాపార్డర్ విఫలం.. హుడా మెరుపులు.. లంక ముందు ఊరించే టార్గెట్ నిలిపిన టీమిండియా

IND vs SL LIVE: ఈ ఏడాది తొలి మ్యాచ్ లో  పూర్తిగా యువ జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా శ్రీలంకతో  జరుగుతున్న తొలి టీ20 లో బ్యాటింగ్ లో తడబడింది. దీపక్ హుడా, ఇషాన్ కిషన్ మినహా మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 

INDvsSL Live: Deepak Hooda and Ishan Kishan Helps Team India To Set 163 Target For Sri Lanka
Author
First Published Jan 3, 2023, 8:44 PM IST

శ్రీలంకతో తొలి టీ20లో యువ భారత్ బ్యాటింగ్ లో తడబడింది.  చివర్లో  దీపక్ హుడా (23 బంతుల్లో 41 నాటౌట్, 1 ఫోర్, నాలుగు సిక్సర్లు) మెరుపులు మెరిపించకుంటే భారత్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (37), హార్ధిక్ పాండ్యా (29) ఫర్వాలేదనిపించారు. స్టార్ బ్యాటర్లు  సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, శుభమన్ గిల్ లు విఫలమయ్యారు.  కట్టుదిట్టంగా బంతులు వేసిన శ్రీలంక భారత్ ను కట్టడి చేయగలిగింది.   చివర్లో దీపక్ హుడా మెరుపులతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక బౌలర్లు  సమిష్టిగా రాణించారు.   

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా..  తొలి రెండు ఓవర్లలో రెచ్చిపోయి ఆడింది. ఇషాన్ కిషన్  తొలి ఓవర్లోనే  ఓ బారీ సిక్సర్, రెండు  ఫోర్లు బాదాడు.  రెండో ఓవర్లో శుభమన్ గిల్ (7) కూడా మధుషనక బౌలింగ్ లో ఫోర్ బాదాడు.  కానీ మహేశ్ తీక్షణ వేసిన    మూడో ఓవర్లో గిల్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 

వన్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (7)  కూడా ఎక్కువసేపు నిలువలేదు. తన ఫేవరేట్  స్కూప్ షాట్ ఆడబోయిన  సూర్య..  ఔట్ సైడ్ ఆఫ్ వద్ద  ఉన్న భానుక రాజపక్సకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ వికెట్ చమీక కరుణరత్నె కు దక్కింది. 

సూర్య తర్వాత  క్రీజులోకి వచ్చిన  సంజూ శాంసన్ (5) కూడా  ఆకట్టుకోలేదు. ధనంజయ డిసిల్వ వేసిన  ఏడో ఓవర్లో.. ఐదో బంతి శాంసన్ బ్యాట్ ఎడ్జ్ కు తాకి  మిడ్ వికెట్ వద్ద ఉన్న   మధుశనక చేతిలో పడింది. దీంతో టీమిండియా.. 7 ఓవర్లలోనే 47 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయింది. 

ఒకవైపు వికెట్లు క్రమం తప్పకుండా కోల్పోతున్నా లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కున్న  ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37)    కసున్ రజిత వేసిన పదో ఓవర్లో 6,4 బాదాడు.  పది ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు.. 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసి  బాగానే ఉంది.  కానీ 11వ ఓవర్లో హసరంగ.. మూడో బంతికి ఇషాన్ ను ఔట్ చేశాడు.  ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చిన ఇషాన్ పెవలియన్ చేరాడు. ఆదుకుంటాడనుకున్న హార్ధిక్ పాండ్యా (29) కూడా మధుశనక వేసిన  15వ ఓవర్ తొలి బంతికి వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ కు క్యాచ్ ఇచ్చాడు.  15 ఓవర్లు ముగిసేటప్పటికీ భారత్.. 5 వికెట్లు కోల్పోయి  101 పరుగులు చేసింది.  

 

హుడా దూకుడు.. 

ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన దీపక్ హుడా  .. భారీ హిట్టింగ్ లతో విరుచుకుపడ్డాడు.  తీక్షణ వేసిన  16వ ఓవర్లో రెండు భారీ సిక్సరల్లు బాదిన అతడు.. హసరంగ వేసిన తర్వాత ఓవర్లో కూడా మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. అతడికి అక్షర్ పటేల్ ( 20 బంతుల్లో 31 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్)  సాయం అందించాడు.    మధుశనక వేసిన 19వ ఓవర్లో అక్షర్.. ఫోర్,  రెండు డబుల్స్  తీశాడు. దీంతో ఈ ఓవర్లో 15 పరుగులొచ్చాయి.  చివరి ఓవర్లో హుడా ఓ  సిక్సర్, రెండు ఫోర్లు బాదడంతో 13 పరుగులొచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios