Asianet News TeluguAsianet News Telugu

శనక ఒంటరిపోరాటం.. టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన.. తొలి వన్డేలో రోహిత్ సేన ఘన విజయం

INDvsSL ODI: కొత్త ఏడాది తొలి వన్డే ఆడుతున్న  భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండ్  ప్రదర్శన  చేసింది. తొలుత బ్యాటింగ్ లో భారీ స్కోరు చేసి  తర్వాత బౌలింగ్ లో  లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది.  ఈ విజయంతో సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. 

INDvsSL : India Beats Sri Lanka by 67 Runs in  1st ODI
Author
First Published Jan 10, 2023, 9:24 PM IST

స్వదేశంలో శ్రీలంకతో ఇటీవలే టీ20 సిరీస్ ను నెగ్గిన భారత జట్టు  వన్డేలలో కూడా శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా  మంగళవారం గువహతి (అసోం)లోని బర్సపర స్టేడియం వేదికగా ముగిసిన  తొలి వన్డేలో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ లో రాణించి భారీ స్కోరు (373-7)  సాధించిన టీమిండియా.. ఆ తర్వాత లంకను 50 ఓవర్లలో 8 వికెట్లు తీసి 308 పరుగులకే కట్టడి  చేసింది. ఫలితంగా భారత్.. 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో తర్వాతి వన్డే ఈనెల 12న కోల్కతా (ఈడెన్ గార్డెన్) లో జరుగనుంది.

భారీ లక్ష్య ఛేదనలో భారత బౌలింగ్ దళానికి లంక బ్యాటర్లు తోక ముడవక తప్పలేదు. ఆ జట్టులో పతుమ్ నిస్సంక (80 బంతుల్లో 72, 11 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా  కెప్టెన్ దసున్ శనక (88 బంతుల్లో 106 నాటౌట్, 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరివరకూ పోరాడాడు.  ఆఖర్లో అతడు మెరుపులు మెరిపించి సెంచరీ సాధించినా విజయం భారత్ నే వరించింది. ధనంజయ డిసిల్వ (47) రాణించాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ కీలక వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించారు. 

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంకకు ఆదిలోనే సిరాజ్ డబుల్ షాక్ ఇచ్చాడు. షమీ వేసిన తొలి ఓవర్లో  పతుమ్ నిస్సంక.. రెండు ఫోర్లు  కొట్టాడు.  రెండో ఓవర్లో ఫెర్నాండో (5) కూడా  ఓ బౌండరీ  బాదాడు. అయితే  సిరాజ్ వేసిన  శ్రీలంక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో  ఐదో బంతికి ఫెర్నాండో.. హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. 

అదే ఊపులో సిరాజ్.. తర్వాత ఓవర్లో  కుశాల్ మెండిస్ (0) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో లంక 23 పరుగులకే  రెండు వికెట్లను కోల్పోయింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన చరిత్ అసలంక (23) తో కలిసి నిస్సంక లంక ఇన్నింగ్స్ ను చక్కదిద్దాలని  యత్నించాడు.  కానీ ఉమ్రాన్ మాలిక్ వేసిన 14వ ఓవర్లో చివరి బంతికి  వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.  

ఈ  క్రమంలో   నిస్సంకతో కలిసి  ధనంజయ డిసిల్వ (40 బంతుల్లో 47, 9 ఫోర్లు), పతుమ్ నిస్సంక (41 బ్యాటింగ్)  లంకను ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి  నాలుగో వికెట్ కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. నిస్సంకతో పాటు డిసిల్వ కూడా   భారత బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకున్నారు.  ప్రమాదరకంగా పరిణమిస్తున్న  ఈ జంటను  షమీ విడదీశాడు. 

25వ ఓవర్లో  రోహిత్ బౌలింగ్ ఛేంజ్ చేయడం భారత్ కు కలిసొచ్చింది.  షమీ వేసిన 25వ ఓవర్లో  బంతి ధనంజయ బ్యాట్ ను తాకుతూ  వికెట్ కీపర్ రాహుల్ చేతిలో పడింది.  ఈ వికెట్ తర్వాత  లంక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రెండో స్పెల్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఉమ్రాన్ మాలిక్.. నిస్సంకను ఔట్ చేశాడు.  నిస్సంక స్థానంలో వచ్చిన హసరంగ.. చాహల్ వేసిన  32వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది చివరి బంతికి  భారీ షాట్ ఆడబోయి  లాంగాన్ వద్ద శ్రేయాస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో లంక.. ఆరో వికెట్ కోల్పోయింది. 

శనక ఒంటరి పోరాటం.. 

33వ ఓవర్లో రెండో బంతికి ఉమ్రాన్ మాలిక్.. వెల్లలగె (0) ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత కరుణరత్నె (14)ను  హార్ధిక్ పాండ్యా  ఔట్ చేశాడు.  ఓవైపు వికెట్లు పడుతున్నా  కెప్టెన్ దసున్ శనక మాత్రం  ఒంటరిపోరు చేశాడు.   భారత బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకోవడమే గాక గ్రౌండ్ నలువైపులా బౌండరీలు బాదాడు.  చివర్లో  అతడి బ్యాటింగ్ భారత అభిమానులకు కాస్త విసుగు తెప్పించింది. భారత బౌలర్లు ఎక్కడ బంతులు వేసిన శనక వాటిని బౌండరీ దాటించాడు. యాభై బంతుల్లో  హాఫ్ సెంచరీ చేసిన శనక.. తర్వాత యాభై పరుగులు సాధించడానికి  లంకకు విజయం మీద ఆశలు లేకున్నా శనక మాత్రం సెంచరీ సాధించాడు.  కసున్ రజిత (9 నాటౌట్) తో కలిసి చివరి బంతి వరకూ పోరాడటం గమనార్హం.  

భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ కు మూడు వికెట్లు దక్కగా మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. హార్ధిక్ పాండ్యా, షమీ, చాహల్ కు చెరో  వికెట్ దక్కింది.అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది.  ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభమన్ గిల్ (70) రాణించారు. విరాట్ కోహ్లీ (113) సెంచరీ చేశాడు. వన్డేలలో కోహ్లీకి ఇది 45వ సెంచరీ. కెఎల్ రాహుల్ (39) మెరుపులు మెరిపించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios