INDvsSL ODI: శ్రీలంకతో గువహతి వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు మీద కన్నేసింది.  ఓపెనర్ల శతక భాగస్వామ్యం తర్వాత   వచ్చిన పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ కూడా  లంక బౌలర్లపై ధాటిగా ఆడుతున్నాడు. 

స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న తొలివన్డేలో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభమన్ గిల్ (70) లు శతక భాగస్వామ్యం నెలకొల్పి అందించిన శుభారంభాన్ని మిడిలార్డర్ కొనసాగిస్తున్నది. ధాటిగా ఆడిన శ్రేయాస్ అయ్యర్ (24 బంతుల్లో 28, 3 ఫోర్లు, 1 సిక్స్) త్వరగానే నిష్క్రమించినా.. కెఎల్ రాహుల్ (21 బ్యాటింగ్) తో కలిసి ప్రస్తుతం విరాట్ కోహ్లీ (52 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం 36 ఓవర్లు ముగిసేసిరికి భారత్.. మూడు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడింది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు.. లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ చూడచక్కని షాట్లతో అలరించారు. కసున్ రజిత వేసిన తొలి ఓవర్లోనే బౌండరీ బాదిన హిట్‌మ్యాన్.. అతడే వేసిన మూడో ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టాడు. మరో ఎండ్ లో శుభమన్ గిల్ కూడా అదే విధంగా రెచ్చిపోయాడు. మధుశంక వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు.

రజిత వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో రోహిత్ రెండు భారీ సిక్సర్లు బాదడంతో టీమిండియా స్కోరు 6.4 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టిన రోహిత్ మొత్తంగా ఆ ఓవర్లో 17 పరుగులు రాబట్టాడు. హసరంగ వేసిన 13 ఓవర్లో మూడో బంతికి ఫోర్ బాదిన హిట్‌మ్యాన్.. తన కెరీర్ లో 47వ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 41 బంతుల్లో అతడి అర్థ శతకం పూర్తయింది. 

వెల్లలగె వేసిన 15వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీయడం ద్వారా భారత్ వంద పరుగులు పూర్తయ్యాయి. ఇక శనక వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీయడం ద్వారా గిల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 51 బంతుల్లో అతడి అర్థ పెంచరీ పూర్తయింది. వన్డేలలో గిల్ కు ఇది ఐదో హాఫ్ సెంచరీ. 

అర్థ సెంచరీ పూర్తయిన వెంటనే గిల్.. వెల్లలగె వేసిన 19వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. తర్వాత శనక బౌలింగ్ లో తొలి బంతికే బౌండరీ బాదినా నాలుగో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 143 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ ఔట్ అయిన కొద్దిసేపటికే రోహిత్ కూడా మధుశంక బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

రోహిత్ నిష్క్రమణ తర్వాత వచ్చిన శ్రేయాస్ కూడా ధాటిగానే ఆడాడు. మధుశంక వేసిన 26వ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదిన అతడు.. హసరంగ వేసిన 29వ ఓవర్లో భారీ సిక్సర్ కొట్టాడు. కానీ ధనంజయ డిసిల్వ వేసిన తర్వాత ఓవర్లో అవిష్క ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అయ్యర్ నిష్క్రమించిన తర్వాత టీమిండియా స్కోరు వేగం కాస్త తగ్గింది. అయితే కోహ్లీ, రాహుల్ క్రీజులో ఉండటం.. హార్ధిక్, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండటంతో భారత్ భారీ స్కోరు మీద కన్నేసింది. ప్రస్తుత రన్ రేట్ (సుమారు 7) కంటిన్యూ అయినా ఈ మ్యాచ్ లో భారత్.. 350 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.