Asianet News TeluguAsianet News Telugu

శుభమన్ గిల్ సెంచరీ.. క్రీజులో కోహ్లీ.. భారీ స్కోరుపై కన్నేసిన భారత్

INDvsSL Live: శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కు శుభారంభం లభించింది.  ఓపెనర్ గా వచ్చిన శుభమన్ గిల్.. సెంచరీతో  కదం తొక్కాడు. 

INDvsSL 3rd ODI Live: Shubman Gill Completes Century, India Going Strong
Author
First Published Jan 15, 2023, 3:47 PM IST

భారత్ - శ్రీలంక మధ్య తిరువనంతపురం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  టీమిండియా నిలకడగా  ఆడుతున్నది.  కెప్టెన్  రోహిత్ శర్మ (49 బంతుల్లో 42, 2 ఫోర్లు, 3 సిక్సర్లు)  కుదురుకున్నట్టే కనిపించినా  చివరికి  భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు.  మరో ఓపెనర్ శుభమన్ గిల్.. (93 బంతుల్లో 113 నాటౌట్, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకుని   వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ (50 బంతుల్లో 55  నాటౌట్, 6 ఫోర్లు) తో కలిసి   భారత స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.  ప్రస్తుతం 32 ఓవర్లు ముగిసేసరికి భారత్.. ఒక వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది.  గిల్, కోహ్లీ క్రీజులో ఉన్నారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన భారత్  ఇన్నింగ్స్ లో  తొలి ఓవర్ మెయిడిన్ అయింది.   కసున్ రజిత వేసిన  ఓవర్లో రోహిత్ ఒక్క పరుగు కూడా చేయలేదు.   అతడే వేసిన మూడో ఓవర్లో కూడా ఒక్క పరుగే వచ్చింది. 

ఐదో ఓవర్లో శుభమన్ గిల్.. రెండు ఫోర్లు బాదాడు. లాహిరు కుమర వేసిన  ఆరో ఓవర్లో  రోహిత్ తొలి బంతికి సిక్సర్ బాది తర్వాత బంతికి సింగిల్ తీసి ఇవ్వగా గిల్.. నాలుగు వరుస ఫోర్లు కొట్టాడు.   ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులొచ్చాయి.   

రజిత వేసిన  తొలి ఓవర్  లో ఇబ్బందిపడ్డ  రోహిత్.. తర్వాత  అతడే వేసిన పదో ఓవర్లో  రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టాడు.  10 ఓవర్లు ముగిసేనాటికి భారత్ స్కోరు  వికెట్ నష్టపోకుండా 75 పరుగులు.  

కరుణరత్నే వేసిన 15వ ఓవర్లో   రోహిత్ భారీ షాట్ కు  యత్నించి..  అవిష్క ఫెర్నాండో కు  క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత  క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. కూడా దూకుడుగానే ఆడుతున్నాడు.   వెండర్సే వేసిన 17వ ఓవర్లో కోహ్లీ రెండు ఫోర్లు బాదాడు.  అతడే వేసిన  19వ ఓవర్లో  చివరి బంతికి సింగిల్ తీయడం ద్వారా గిల్..  52 బంతులలో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  

 

హాఫ్ సెంచరీ  తర్వాత గిల్ దూకుడు పెంచాడు.  కోహ్లతో వికెట్ల మధ్య పరిగెడుతూనే   ఫెర్నాండో వేసిన  29వ ఓవర్లో ఓ ఫోర్, సిక్సర్ బాది 90లలోకి వచ్చాడు.  ఇక ఫెర్నాండోనే వేసిన 31వ ఓవర్లో చివరి బంతికి సింగిల్ తీసి తన  కెరీర్ లో రెండో  వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  89 బంతుల్లోనే అతడి సెంచరీ  పూర్తయింది.  కోహ్లీ, గిల్ లతో పాటు వికెట్లు చేతులో ఉండటంతో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios